‘అతను’ నాతో మాట్లాడాడు 

13 Jun, 2020 00:34 IST|Sakshi

క్షమాపణ అవసరం లేదన్న స్యామీ

కింగ్‌స్టన్‌: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడినప్పుడు వర్ణ వివక్షకు గురయ్యానంటూ వ్యాఖ్యలు చేసిన వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ డారెన్‌ స్యామీ ఇప్పుడు ఆ వివాదానికి ముగింపునిచ్చే ప్రయత్నం చేశాడు. అప్పుడు సన్‌రైజర్స్‌ జట్టు సహచరుడొకరు తనను కాలూ (నల్లోడు) అన్నాడని, ఇప్పటికైనా అతను తనతో మాట్లాడి క్షమాపణ చెప్పాలని ఇటీవల డిమాండ్‌ చేశాడు. తాజాగా స్యామీ శుక్రవారం దీనిపై ఒక ప్రకటన చేశాడు. సదరు క్రికెటర్‌ తనతో అభిమానంగా మాట్లాడాడని, ఇక ప్రత్యేకంగా క్షమాపణ కోరాల్సిన అవసరం లేదని చెప్పాడు. ‘వివాదంలో భాగమైన ఆ క్రికెటర్‌ నాతో మాట్లాడాడు. మా సంభాషణ బాగా సాగింది. ఈ అంశంలో చెడును చూడటంకంటే వివక్షపై తగిన అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలని నిర్ణయించాం. నా సోదరుడు ప్రేమతోనే అలా మాట్లాడానని చెప్పాడు. అతని మాటలు నమ్ముతున్నాను. ఉద్దేశపూర్వంగా చేయలేదని అర్థమైంది. ఇక నేను క్షమాపణ కోరుకోవడం లేదు. అతని పేరు కూడా నేను చెప్పను. ఇకపై అలాంటిది జరగకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. నల్లజాతీయుడిగా ఉండటం నాకు ఎప్పటికీ గర్వకారణమే’ అని స్యామీ పేర్కొన్నాడు.  

మరిన్ని వార్తలు