ఆ భయం నాకు లేదు: గంగూలీ

24 Dec, 2019 14:19 IST|Sakshi
1996లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో సౌరవ్‌ గంగూలీ(ఫైల్‌ఫొటో)

న్యూఢిల్లీ:  దాదాపు రెండు దశాబ్దాల క్రితం  తన టెస్టు అరంగేట్రాన్ని ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు, భారత  క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ మరోసారి నెమరువేసుకున్నాడు. తన టెస్టు అరంగేట్రం లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరగ్గా, అందుకు తాను పూర్తి స్థాయిలో సిద్ధమై అక్కడకు వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు. తన తొలి టెస్టుకు ఎటువంటి భయం లేకుండా ఉండటంతోనే సెంచరీ చేశానని గంగూలీ  స్పష్టం చేశాడు.  అది అరంగేట్రం టెస్టు మ్యాచ్‌ అనే భయం తనకు లేదన్నాడు.

‘ 1996లో లార్డ్స్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌కు అసాధారణమైన మైండ్‌సెట్‌తో ఉన్నా. నాకు భయం అని ఎక్కడ అనిపించలేదు. ఆ  పర్యటనకు వెళ్లాను.. ఆడాను అన్నట్లే ఉంది నా పరిస్థితి. ఇంగ్లండ్‌ పర్యటనలో తొలి వార్మప్‌ మ్యాచ్‌కు బ్రిస్టల్‌ వెళ్లగా ఆ మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్‌ అయ్యా. ఇక రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 70 పరుగులు చేశా. ఇలా ఆ సిరీస్‌లో పరిణితి చెందుతూనే ముందుకు సాగా’ అని గంగూలీ తెలిపాడు.అయితే తాను ఫాస్ట్‌ బౌలింగ్‌ను ఆడలేనని అభిమానులు ఎక్కువగా మాట్లాడుకునేవారన్నాడు. కాకపోతే తన చేతికి బ్యాట్‌ ఇస్తే పరుగులు చేయడమే తెలుసన్నాడు. ఇక్కడ అది ఫాస్ట్‌ బౌలింగా.. స్పిన్‌ బౌలింగ్‌ అనేది తనకు తెలీదన్నాడు. అదే సమయంలో ఫామ్‌లో ఉండటం, ఫామ్‌లో లేకపోవడం అనే విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకునే వాడిని కాదని గంగూలీ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు