నాకు వేరే చాయిస్‌ లేదు: మనీష్‌ పాండే

1 Feb, 2020 15:41 IST|Sakshi

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో జరిగిన నాల్గో టీ20లో శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన ఆఖరి ఓవర్‌తో పాటు కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లిల ప్రదర్శనే ఎక్కువ హైలైట్‌ అ‍య్యింది. న్యూజిలాండ్‌ 7 పరుగులు చేయాల్సిన తరుణంలో 6 పరుగులే ఇచ్చి రెండు వికెట్లను శార్దూల్‌ సాధించి మ్యాచ్‌ను టై చేయడంలో కీలక పాత్ర పోషించగా, సూపర్‌ ఓవర్‌లో రాహుల్‌, కోహ్లిలు బ్యాట్‌ ఝుళిపించి అద్భుతమైన విజయాన్ని అందించారు. కాగా, అసలు కివీస్‌ ముందు పోరాడే స్కోరును ఉంచడంలో మనీష్‌ పాండే ప్రధాన పాత్ర పోషించాడు. కీలక వికెట్లు కోల్పోయిన తరుణంలో సమయోచితంగా ఆడి అజేయంగా హాఫ్‌ సెంచరీ సాధించాడు. (ఇక్కడ చదవండి: మనీష్‌ పాండే డబుల్‌ హ్యాట్రిక్‌)

ఫలితంగా టీమిండియా పోరాడే స్కోరును కివీస్‌ ముందుంచింది. మ్యాచ్‌ తర్వాత తన ప్రదర్శనతో పాటు బ్యాటింగ్‌ ఆర్డర్‌పై మనీష్‌ మాట్లాడుతూ.. ‘ నా ఆట తీరుపై సంతృప్తిగా ఉన్నా. నేను ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి విలువైన పరుగులు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నాది ఆరో స్థానమనే ఫిక్స్‌ అయ్యా. ఆ రకంగానే సన్నద్ధమవుతున్నా. ఎందుకంటే ముందు వరుసలో రావడానికి నాకు చాయిస్‌ లేదు. ప్రస్తుతం ఆ స్థానం కోసమే మానసికంగా సన్నద్ధమవుతున్నాం. నేను సాధారణంగా మూడు లేదా నాల్గో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తూ ఉంటా. అయితే ఇప్పుడు ఆ స్థానాల్లో పోటీ నెలకొంది. దాంతో దిగువన రావాల్సి వస్తుంది. మన చాన్స్‌ల కోసం నిరీక్షించకతప‍్పదు’ అని మనీష్‌ పాండే తెలిపాడు. 

మరిన్ని వార్తలు