ఐఎస్‌ఎల్, ఐ–లీగ్‌ విలీనమైతే మంచిదే

28 Dec, 2016 00:40 IST|Sakshi
ఐఎస్‌ఎల్, ఐ–లీగ్‌ విలీనమైతే మంచిదే

భారత ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ సునీల్‌ చెత్రి   

న్యూఢిల్లీ: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌), దేశవాళీ ఫుట్‌బాల్‌ ‘ఐ–లీగ్‌’లను విలీనం చేసే ప్రతిపాదనకు భారత ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ సునీల్‌ చెత్రి మద్దతిచ్చాడు. ఇదే జరిగితే జాతీయ జట్టుకు మరిన్ని ‘ఫిఫా’ స్నేహపూర్వక మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కుతుందని, ర్యాంకింగ్‌ కూడా మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 20 జట్లతో కూడిన లీగ్‌ను ఆడిస్తే దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన ఆటగాళ్లకు చోటు దక్కినట్టవుతుందన్నాడు. పది జట్లతో కూడిన ఐ–లీగ్‌ 2017 సీజన్‌ జనవరి 7న మొదలుకానుంది. ఈ సందర్భంగా మంగళవారం అన్ని జట్ల కెప్టెన్‌లతో కలసి ట్రోఫీని ఆవిష్కరించారు. ఈసారి ఐ–లీగ్‌లో కొత్తగా చెన్నై సిటీ ఎఫ్‌సీ, మినర్వా పంజాబ్‌ జట్లకు చోటు కల్పించారు. మరోవైపు ఐఎస్‌ఎల్, ఐ–లీగ్‌ల విలీనంపై కొంత వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. ‘జట్లు ఎక్కువగా ఉంటే లీగ్‌కు మంచిది. 20 టీమ్స్‌ ఉంటే మరీ మంచిది.

మధ్యప్రదేశ్, లక్షద్వీప్‌ నుంచి కూడా టీమ్స్‌ ఉండే అవకాశం ఉంటుంది. గుజరాత్‌లో ఓ పిల్లాడు ఫుట్‌బాల్‌లో స్టార్‌ కావాలనుకుంటే అందుకు తగిన పరిస్థితులను మనం కల్పించాలి. ఎందుకు మనకు కేరళ, బెంగాల్, నార్త్‌ ఈస్ట్‌ నుంచే ఆటగాళ్లు వస్తుంటారు? మధ్యప్రదేశ్‌ నుంచి ఎందుకు సూపర్‌స్టార్లు లేరు? అక్కడ కూడా కచ్చితంగా టాలెంట్‌ ఉంటుంది. అందుకే అన్ని చోట్ల నుంచి జట్లు ఉండాలని కోరుకుంటున్నాను. భారత ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌గా ఐఎస్‌ఎల్, ఐ–లీగ్‌లు విలీనమైతే సంతోషిస్తా. ఆటగాళ్లు కూడా అదే కోరుకుంటున్నారు. కానీ అది వాళ్ల చేతుల్లో లేదు’ అని చెత్రి అన్నాడు. తమ నైపుణ్యాన్ని మరింత పెంచుకునేందుకు ఆటగాళ్లు విదేశీ క్లబ్బులకు ఆడడంలో తప్పేమీ లేదని అన్నాడు. భారత జట్టు ముందుగా ఆసియాలో టాప్‌–10లో నిలవాలని, ఆ తర్వాతే 2022 ప్రపంచకప్‌కు అర్హత సాధించడంపై ఆలోచించాలని సూచించాడు.  

మరిన్ని వార్తలు