సెంచరీనో, డబుల్‌ సెంచరీనో కొడతా!

25 Dec, 2018 01:25 IST|Sakshi

రహానే ఆత్మవిశ్వాసం

మెల్‌బోర్న్‌: గత ఏడాది ఆగస్టులో శ్రీలంకపై కొలంబోలో అజింక్య రహానే తన ఆఖరి సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత 15 టెస్టులు ఆడిన అతను మళ్లీ శతకం చేయలేదు. ఐదు అర్ధ సెంచరీలు మాత్రం సాధించగలిగాడు. వీటిలో రెండు తాజా ఆసీస్‌ సిరీస్‌లోనే వచ్చాయి. అయితే తాను భారీ స్కోరు సాధించడానికి మరెంతో దూరంలో లేనని, మెల్‌బోర్న్‌ టెస్టులో భారీ ఇన్నింగ్స్‌ ఆడతానని రహానే విశ్వాసం వ్యక్తం చేశాడు. సెంచరీ కాదంటే డబుల్‌ సెంచరీ కూడా కొట్టగలనని అతను చెప్పాడు. ‘అడిలైడ్, పెర్త్‌లలో నేను ఆడిన తీరు చూస్తుంటే మూడో టెస్టులోనే సెంచరీ సాధించగలనని నమ్ముతున్నా. కౌంటర్‌ అటాక్‌ చేయడంలో నా మానసిక దృక్పథం, నేను బ్యాటింగ్‌ చేస్తున్న లయను బట్టి చూస్తే 100 లేదంటే 200 పరుగులు కూడా చేయగలనేమో’ అని రహానే వ్యాఖ్యానించాడు. అయితే దాని గురించి అతిగా ఆలోచించడం అనవసరమని, పరిస్థితిని అర్థం చేసుకుంటూ ప్రస్తుతం ఆడుతున్న శైలిలోనే ఆడితే జట్టుకు మేలు చేసినవాడినవుతానని అన్నాడు. ఆస్ట్రేలియాతో 2014 సిరీస్‌లో ఎంసీజీ మైదానంలో రహానే... 171 బంతుల్లోనే 21 ఫోర్లతో 147 పరుగులు చేశాడు.   

కోహ్లి దూకుడే... కానీ! 
రెండో టెస్టు సందర్భంగా భారత కెప్టెన్‌ కోహ్లి తనకు అతి దగ్గరగా వచ్చాడే తప్ప... కోపమేమీ ప్రదర్శించలేదని ఆస్ట్రేలియా సారథి టిమ్‌ పైన్‌ అన్నాడు. ‘వాస్తవంగా చెప్పాలంటే నేను అంతర్జాతీయ క్రికెట్‌లో లేని రోజుల్లో కోహ్లిని అభిమానించేవాడిని. ఇతర ప్రొఫెషనల్‌ అథ్లెట్లలానే అతడు ఓటమిని ఒప్పుకోడు. వ్యక్తిగతంగా ఏమిటో తెలియకున్నా, ఆటపట్ల కోహ్లి దృక్పథాన్ని, దూకుడును నేను ఇష్టపడతా’ అని పైన్‌ అన్నాడు.    

>
మరిన్ని వార్తలు