‘నా వన్డే జట్టులో పుజారా ఎప్పుడూ ఉంటాడు’

17 Jul, 2020 16:47 IST|Sakshi

న్యూఢిల్లీ: చతేశ్వర్‌ పుజారా.. భారత క్రికెట్‌ జట్టులో టెస్టు ప్లేయర్‌గా ముద్ర పడిన ఆటగాడు. ఇదే అతనికే తీవ్ర నష్టం చేసింది కూడా. సుదీర్ఘ ఫార్మాట్‌ జట్టులో రెగ్యులర్‌ ఆటగాడిగా ఉండే పుజారా.. వన్డే ఫార్మాట్‌లో కేవలం ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. పుజారా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు సరిపోడనే అపవాదుతో అతన్ని కనీసం ఐపీఎల్‌లో కూడా పరిశీలించడం లేదు. ఎప్పుడో ఐపీఎల్‌ ఆడిన అనుభవం ఉన్న పుజారా.. గత కొన్ని సీజన్ల నుంచి ఐపీఎల్‌ వేలానికి అందుబాటులోకి వస్తున్నా అతని వైపు కనీసం ఎవరూ చూడటం లేదు. తాను పరిమిత ఓవర్ల క్రికెట్‌కు సరిపోతానని పదే పదే మొత్తుకున్నా పుజారాకు నిరాశే ఎదురవుతోంది. అయితే పుజారాకు తన వన్డే జట్టులో ఎప్పుడూ చోటు ఉంటుందని అంటున్నాడు టీమిండియా మాజీ స్పిన్నర్‌ దిలీప్‌ జోషీ.(ఐపీఎల్‌ అజెండాగా...)

‘పుజారా నా వన్డే జట్టులో ఎప్పుడూ ఉంటాడు. అతన్ని నా వన్డే జట్టు నుంచి ఎప్పుడూ తీయను కూడా. అవసరమైతే ఇన్నింగ్స్‌ చివరి వరకూ పుజారానే ఉండమని కూడా అడుగుతా. పుజారా 50 ఓవర్ల పాటు సుదీర్ఘమైన ఇన్నింగ్స్‌ ఆడే సామర్థ్యం ఉన్న ఆటగాడు. సమయోచితంగా బ్యాటింగ్‌ చేయడంలో పుజారా దిట్ట. టెస్టు క్రికెట్‌లో అవసరమైన ఆటగాడు, వన్డేలకు ఎందుకు పనికిరాడో అర్థం కావడం లేదు. ఒకే తరహా బ్యాటింగ్‌ అతనికి శత్రువులా మారింది. పుజారాలాంటి హైప్రొఫైల్‌ ఆటగాడు చాలా నెమ్మది అంటూ అవకాశాలు ఇవ్వకపోవడం నాకు బాధనిపిస్తోంది. టీ20 ఫార్మాట్‌ వచ్చిన తర్వాత గేమ్‌ స్వరూపమే మారిపోయింది. నాకు తెలిసినంత వరకూ ఒక మంచి క్లబ్‌ నుంచి వచ్చిన నాణ్యమైన ఆటగాడు టీ20ల్లో ఫిట్‌ అవుతాడనే విషయం తెలుసుకోవాలి’ అని దిలీప్‌ జోషీ పేర్కొన్నాడు. అసలు సిసలు చాలెంజ్‌ అంటే అది టెస్టు క్రికెట్‌ అని విషయం క్రికెట్‌ పెద్దలు గుర్తించాలన్నాడు. 2013లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన పుజారా.. వన్డే ఫార్మాట్‌లో ఐదు మ్యాచ్‌లకే పరిమితిమైనా, టెస్టు ఫార్మాట్‌లో 77 మ్యాచ్‌లు ఆడాడు. ఇక దిలీప్‌ జోషీ 33 టెస్టులు, 15 వన్డేలకు భారత్‌ తరఫున ప్రాతినిథ్యం వహించాడు.

మరిన్ని వార్తలు