అది షేన్‌ వార్న్‌కే సాధ్యం: యూసఫ్

30 Apr, 2020 13:51 IST|Sakshi

ధోని తెలివైన క్రికెటర్‌

యువరాజ్‌ ఒక రాక్‌స్టార్‌

న్యూఢిల్లీ: ఆసీస్‌ దిగ్గజ ఆటగాడు షేన్‌ వార్న్‌పై టీమిండియా వెటరన్‌ ఆల్‌రౌండర్‌ యూసఫ్‌ పఠాన్‌ ప్రశంసలు కురిపించాడు. అతని సారథ్యంలో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున మూడేళ్ల పాటు ఆడిన యూసఫ్‌ అదొక గొప్ప అవకాశమన్నాడు. కానీ వార్న్‌ కెప్టెన్సీలో మూడు సీజన్ల కంటే ఎక్కువ ఆడకపోవడం తన దురదృష్టమన్నాడు. ఈ సందర్భంగా వార్న్‌ నాయకత్వంలో మూడేళ్లు ఆడిన విషయాన్ని యూసఫ్‌ గుర్తు చేసుకున్నాడు. అతి తక్కువ వనరులతో ఆరంభ టైటిల్‌ను గెలుచుకోవడం వార్న్‌ నాయకత్వానికి అద్దం పడుతుందన్నాడు. ఏదో కొద్దిపాటి వనరులతో జట్టును ఫైనల్‌కు చేర్చడమే కాకుండా విజేతగా నిలపడం అది వార్న్‌కే దక్కుతుందన్నాడు. 2008 ఐపీఎల్‌ ఆరంభమైన ఏడాది రాజస్తాన్‌ రాయల్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. (అక్తర్‌పై ‘పీసీబీ’ పరువు నష్టం కేసు)

తాజాగా క్రికెట్‌ ట్రాకర్‌ లైవ్‌ సెషన్‌లో మాట్లాడిన యూసఫ్‌.. ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. ఐపీఎల్‌లో వార్న్‌ నాయకత్వంలో మూడేళ్లు ఆడా. వార్న్‌తో చాలా మధుర స్మృతులు ఉన్నాయి. మమ్మల్ని వార్న్‌ మార్గ నిర్దేశం చేసిన తీరు అమోఘం, బ్యాట్స్‌మన్‌ను ఎలా పెవిలియన్‌కు పంపాలనే విషయంలో వార్న్‌ ఎన్నో టెక్నిక్స్‌ నేర్పాడు. అతనితో సుదీర్ఘ కాలం క్రికెట్‌ ఆడకపోవడం నిజంగా నా బ్యాడ్‌ లక్‌. ఐపీఎల్‌ ఆరంభమైన ఏడాదే టైటిల్‌ను సాధించడంలో వార్న్‌ పాత్ర చాలా ఉంది. ఎక్కువ మంది దేశవాళీ ఆటగాళ్లతో ఉన్న జట్టును విజేతగా నిలిపాడు. అలా టైటిల్‌ గెలవడం మరెవరికీ సాధ్యం కాకపోవచ్చు’ అని యూసఫ్‌ పేర్కొన్నాడు. ఇక భారత క్రికెటర్లు ఎంఎస్‌ ధోని, యువరాజ్‌ సింగ్‌లను యూసఫ్‌ కొనియాడాడు. ధోని ఒక తెలివైన క్రికెటర్‌ అని పేర్కొన్న యూసఫ్‌.. యువరాజ్‌ను ఒక రాక్‌స్టార్‌గా అభివర్ణించాడు. (ఖవాజా, షాన్‌ మార్ష్‌లను తప్పించారు..!)

మరిన్ని వార్తలు