'కోచ్ రేసులో నేనున్నాను'

24 Apr, 2016 16:33 IST|Sakshi
'కోచ్ రేసులో నేనున్నాను'

కరాచీ: మేజర్ టోర్నమెంట్లు జరిగిన ప్రతిసారి పాకిస్తాన్ క్రికెట్ కోచ్ ఆందోళనకు గురవుతుంటాడు. ఎందుకంటే ప్రత్యర్థిగా భారత్ ఎదురవడం, దాయాది చేతిలో ఓటమి చవిచూడటం మనకు తెలిసిందే. ఇప్పటివరకు ప్రపంచకప్ లాంటి మేజర్ ఈవెంట్లలో భారత్ పై నెగ్గిన చరిత్ర ఆ జట్టుకు లేదు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ చేతిలో ఓటమి తర్వాత ఆ దేశంలో నిరసనలు వెల్లువెత్తడంతో కోచ్ పదవికి తానే స్వయంగా రాజీనామా చేస్తున్నట్లు వకార్ యూనిస్ ప్రకటించాడు. బోర్డుకు రాజీనామా లేఖను అందించాడు. అప్పటినుంచీ ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. 53 టెస్టులు, 283 వన్డే మ్యాచ్ లు ఆడిన పాక్ మాజీ క్రికెటర్ సలీం మాలిక్ కోచ్ పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చాడు.

కోచ్ రేసులో తాను ఉన్నట్లు పాక్ మాజీ కెప్టెన్ సలీం మాలిక్ వెల్లడించాడు. పాక్ జట్టుకు కోచ్ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని, ఆ పదవికి ఆప్లై చేస్తానని చెప్పాడు. అయితే సలీం మాలిక్ పై పాక్ బోర్డు విధించిన నిషేధం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడన్న ఆరోపణలతో 2000లోనే అతడిపై వేటు పడిన విషయం తెలిసిందే. పాక్ జట్టు ఇటీవలే ఇంజమామ్ ను జాతీయ సెలెక్టర్ గా నియమించింది. కోచ్ పదవికి విదేశీయుల పేర్లను పరిశీలించడం కూడా పాక్ క్రికెట్ బోర్డు మొదలుపెట్టింది. విదేశీ కోచ్ ను తీసుకురావడం అనేది వృథా ప్రయత్నమని పేర్కొన్నాడు. జస్టిస్ మాలిక్ ఖయ్యూం కమిషన్ తనపై నిషేధం విదించాలని గతంలో నిర్ణయించిన మాట వాస్తవమేనని, అయితే ఎప్పటివరకు తాను క్రికెట్ కు దూరంగా ఉండాల్సి వస్తుందో తెలియదన్నాడు. ఆ వివరాలపై స్పష్టతలేదంటూనే.. ఏ ఫార్మాట్లోనూ తాను క్రికెట్ ఆడలేదని అందుకే జాతీయజట్టుకు సేవలు అందించాలని భావిస్తున్నట్లు వివరించాడు.

మరిన్ని వార్తలు