'వరల్డ్ నంబర్ వన్ ర్యాంకే లక్ష్యం'

29 Aug, 2017 12:29 IST|Sakshi
'వరల్డ్ నంబర్ వన్ ర్యాంకే లక్ష్యం'

హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ లో రజత పతకం గెలవడం పట్ల తెలుగమ్మాయి పీవీ సింధు సంతోషం వ్యక్తం చేశారు.తన ప్రదర్శన ఎంతో ఆనందాన్ని మిగిల్చిందని పేర్కొన్న సింధు.. ఇదంతా కోచ్, తల్లి దండ్రుల సహకారంతోనే సాధ్యమైందని స్పష్టం చేశారు. జపాన్ క్రీడాకారిణి ఒకుహరాతో జరిగిన ఫైనల్ పోరు చాలా కఠినంగా సాగిందని సింధు పేర్కొన్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ముగిసిన తరువాత కోచ్ గోపీ చంద్ తో కలిసి హైదరాబాద్ చేరుకున్న సింధు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.

'రజతం గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఘనత సాధించడం వెనుక కోచ్, తల్లి దండ్రుల కృషి ఎంతో ఉంది. ఫైనల్ మ్యాచ్ చాలా కఠినంగా సాగింది. హోరాహోరీగా జరిగిన పోరులో తృటిలో స్వర్ణాన్ని కోల్పోయా. అయినా నా ప్రదర్శన పట్ల చాలా సంతృప్తిగా ఉన్నా. ప్రేక్షకుల నుంచి లభించిన మద్దతు మరువలేనిది. వరల్డ్ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించడమే లక్ష్యం' అని సింధు తెలిపారు.ప్రస్తుతం వరల్డ్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ లో సింధు నాల్గో ర్యాంకులో కొనసాగుతున్నారు.