‘వరల్డ్‌కప్‌ నా చేతుల్లో ఉండాలనుకుంటున్నా’

13 Jun, 2019 14:28 IST|Sakshi

నాటింగ్‌హామ్‌: గత రెండు-మూడేళ్లుగా వరల్డ్‌కప్‌లో ఆడటమే లక్ష్యంగా తీవ్రంగా శ్రమించానని, అదే సమయంలో ఇప్పుడు ఆ మెగా కప్‌ కూడా తన చేతుల్లో ఉండాలని కోరుకుంటున్నానని టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను ఇంగ్లండ్‌లో ఉన్నది కేవలం వరల్డ్‌కప్‌ గెలవడం కోసమేనంటూ పాండ్యా తన మనసులోని మాటను స్పష్టం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ)కి ఇచ్చిన తాజా ఇంటర్య్వూలో హార్దిక్‌ పాండ్యా మాట్లాడుతూ .. తన జీవితంలో భారత్‌కు ఆడాలనే ఏకైక కోరికతో శ్రమించానని, ఇప్పుడు తన ముందున్న లక్ష్యం మాత్రం ప్రపంచకప్‌ను గెలవడమేనన్నాడు.

‘భారత క్రికెట్‌ జట్టు నాకు అన్నీ ఇచ్చింది. క్రికెట్‌ అనేది నా జీవితం. ఆటను ఎంతగా ప్రేమిస్తానో, ఈ గేమ్‌లో ఎదురయ్యే చాలెంజ్‌లను కూడా అంతగానే ఆస్వాదిస్తా. మూడేళ్లుగా వరల్డ్‌కప్‌ కోసం నా సన్నాహకం సాగుతోంది. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. జూలై 14(వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగే రోజు) ప్రపంచకప్‌ నా చేతుల్లో ఉండాలని కోరుకుంటున్నా. 2011 వరల్డ్‌కప్‌ను టీమిండియా గెలిచిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటే నా ఒళ్లు పులకరించి పోతుంది. 2019 వరల్డ్‌కప్‌లో ఆడటం అనేది నా కల. నా ప్రణాళిక వరల్డ్‌కప్‌ను గెలవడమే. అది జరుగుతుందని బలంగా నమ్ముతున్నా’ అని హార్దిక్‌ పేర్కొన్నాడు.


 

మరిన్ని వార్తలు