వారు చింతించాల్సిన పనిలేదు : రవిశాస్త్రి

18 Apr, 2019 00:55 IST|Sakshi

దుబాయ్‌: ప్రపంచకప్‌ కోసం తాను 16 మంది ఎంపికను ఆశించానని భారత కోచ్‌ రవిశాస్త్రి తెలిపారు. 15 మందికి బదులుగా 16 మంది ఆటగాళ్లయితే బాగుంటుందని సెలక్షన్‌ వర్గాలతో చెప్పానన్నారు. ‘ఇదే విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)తోనూ చర్చించాం. సుదీర్ఘ టోర్నీకి 16 మంది సభ్యులైతే బాగుంటుందనే అభిప్రాయాన్ని వెల్లడించాం’ అని కోచ్‌ అన్నారు. అయితే భారత జట్టుకు ఎంపిక కాలేకపోయిన ఆటగాళ్లు మనోస్థైర్యాన్ని కోల్పోకూడదని ధైర్యం చెప్పారు. జట్టులో రిషబ్‌ పంత్, రాయుడు లేకపోవడంపై విమర్శలొస్తున్న నేపథ్యంలో కోచ్‌ మాట్లాడుతూ ‘ఎంపికల ప్రక్రియలో నేనెప్పుడు కల్పించుకోను. నాకేమైనా చెప్పాలనిపిస్తే అది నేరుగా కెప్టెన్‌తోనే చర్చిస్తా.

ఏదేమైనా ఈ 15 మందిలో లేకపోయిన ఆటగాళ్లు గుండెపగిలినంతగా చింతించకూడదు. ఇది సరదా ఆట. ఎవరైనా గాయపడొచ్చు. ఎవరికైనా అవకాశాలు దక్కవచ్చు’ అని అన్నారు. నాలుగో స్థానంలో రాయుడిని కాదని విజయ్‌ శంకర్‌ను తీసుకోవడం పట్ల ఆయన స్పందిస్తూ... ఆ స్థానంలో ఫలాన ఆటగాడే ఆడాలనే ఆవశ్యకత లేదని, అప్పటి పరిస్థితులు, ఎదురైన ప్రత్యర్థిని బట్టి ఆటగాడి తుది ఎంపిక ఉంటుందని చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లుగా భారత జట్టు అన్ని ఫార్మాట్లలోనూ టాప్‌–3లో ఉందని, కోహ్లి సేన అంచనాలను అందుకుంటుందని తెలిపారు. తన దృష్టిలో ప్రపంచకప్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ టైటిల్‌ ఫేవరెట్‌ జట్టని... రెండేళ్లుగా ఆ జట్టు నిలకడగా రాణిస్తోందని రవిశాస్త్రి కితాబిచ్చారు. 

మరిన్ని వార్తలు