షమీకి ఊరట

23 Mar, 2018 01:24 IST|Sakshi

అనుకూలంగా ఏసీయూ నివేదిక

బీసీసీఐ కాంట్రాక్ట్‌లో చోటు 

ముంబై: భారత పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీకి ఎట్టకేలకు కాస్త సాంత్వన దక్కింది. భార్య చేసిన గృహ హింస ఆరోపణలు, క్రిమినల్‌ కేసులు, కాంట్రాక్ట్‌ నిలిపివేతలతో పాటు ఫిక్సింగ్‌ తరహా వివాదంతో గత రెండు వారాలుగా ఉక్కిరిబిక్కిరవుతున్న అతనికి కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం లభించింది. షమీని వార్షిక కాంట్రాక్ట్‌ జాబితాలో చేర్చాలని బీసీసీఐ గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బోర్డు ఒక ప్రకటన చేసింది. దీనికి తోడు బీసీసీఐ అవినీతి వ్యతిరేక విభాగం (ఏసీయూ) హెడ్‌ నీరజ్‌ కుమార్‌ కూడా తన విచారణలో షమీకి అనుకూలంగా నివేదిక ఇచ్చారు.

షమీ భార్య హసీన్‌ జహాన్‌ చేసిన ఆరోపణల ప్రకారం షమీ దుబాయ్‌లో రెండు రోజులు గడపడం... పాక్‌ మహిళ అలీష్బా, ఇంగ్లండ్‌కు చెందిన మొహమ్మద్‌ భాయ్‌లతో ఉన్న సంబంధం గురించి తేల్చాలంటూ క్రికెట్‌ పరిపాలకుల కమిటీ (సీఓఏ) నీరజ్‌ను కోరిన విషయం తెలిసిందే. ఈ విషయంలో షమీని అనుమానించేందుకు ఏమీ లేదని నివేదికలో ఉన్నట్లు సమాచారం. ‘బీసీసీఐ యాంటీ కరప్షన్‌ కోడ్‌ ప్రకారం ఇక ముందు షమీపై ఎలాంటి చర్య తీసుకోరాదని సీఓఏ భావిస్తోంది.

ఇదే కారణంగా బోర్డు షమీకి కాంట్రాక్ట్‌ అందజేస్తోంది’ అని బీసీసీఐ స్పష్టం చేసింది. షమీకి గ్రేడ్‌ ‘బి’ కాంట్రాక్ట్‌ దక్కింది. దీని ప్రకారం అతనికి ఏడాదికి రూ. 3 కోట్లు లభిస్తాయి. తాజా పరిణామంతో షమీ ఐపీఎల్‌ ఆడేందుకు మార్గం సుగమమైంది. ఆటపరంగా అతనికి ప్రస్తుతానికి సమస్య తప్పినా... మరో వైపు భార్య ఫిర్యాదుపై నమోదు చేసిన కేసుల విచారణ మాత్రం కొనసాగుతుంది.   

ఇది నాకో గొప్ప విజయం. మిగతా ఆరోపణల నుంచి కూడా నిర్దోషిగా బయటపడతా. నా వ్యక్తిత్వం, దేశభక్తిని శంకించడంతో వేదనకు గురయ్యా. బీసీసీఐ విచారణపై పూర్తి నమ్మకముంచా. 10–15 రోజులుగా తీవ్ర ఒత్తిడి అనుభవించా. నిర్దోషిగా ప్రకటించడంతో స్థైర్యం పెరిగింది. మళ్లీ మైదానంలో దిగేందుకు ప్రేరణగా నిలిచింది. నా కోపాన్నంతా సానుకూల ధోరణితో ఆటలో చూపిస్తా. ఇకపై నా బౌలింగ్‌ గురించే మాట్లాడుకునేలా చేస్తా. నేనే తప్పు చేయలేదని తెలుసు. బీసీసీఐకి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే                
      – మొహమ్మద్‌ షమీ 

మరిన్ని వార్తలు