'నేను ఒత్తిడికి లోనయ్యా'

9 Jan, 2018 16:07 IST|Sakshi

కేప్‌టౌన్‌:టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 72 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో బోణి కొట్టిన సంగతి తెలిసిందే. 208 పరుగుల విజయలక్ష్యాన్ని కాపాడుకున్న సఫారీలు శుభారంభం చేశారు. అయితే టీమిండియాకు నిర్దేశించిన సాధారణ లక్ష్యాన్ని చూసి తాను చాలా ఒత్తిడికి లోనయ్యానని దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డు ప్లెసిస్‌ పేర్కొన్నాడు. ప్రధానంగా తమ రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగులకే పరిమితం కావడం ఆందోళనకు గురిచేసిందన్నాడు.

'టీమిండియాకు  మేము నిర్దేశించిన లక్ష్యాన్ని చూసి ఒత్తిడికి లోనయ్యా. ఎందుకంటే ఇది కష్టసాధ్యమైన లక్ష్యం ఎంతమాత్రం కాదు. అందులోనే భారత జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. అదే నన్ను ఆందోళనకు గురి చేసింది. అయితే కొత్త బంతి అనేది కీలక పాత్ర పోషిస్తుందనే విషయం నాకు తెలుసు. ఆదిలోనే టీమిండియా వికెట్లను తీస్తే వారిని ఒత్తిడిలోకి నెట్టవచ్చనే ధైర్యం కూడా ఒకవైపు ఉంది. దాన్ని మా బౌలర్లు నిజం చేసి చూపించారు. 350 పరుగుల ఆధిక్యం ఉండాలనేది మా వ్యూహం. అయితే మా ప్రణాళిక సక్సెస్‌ కాలేదు. స్వల్ప స్కోరుకే పరిమితమయ్యాం. మా అసాధారణ బౌలింగ్‌ ఎటాక్‌తో 200పైగా లక్ష్యాన్ని కూడా కాపాడుకుని విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది' అని డు ప్లెసిస్‌ పేర్కొన్నాడు.

, , ,

>
మరిన్ని వార్తలు