నాకిష్టం లేకున్నా... మంత్రి రాథోడ్‌ వల్లే చేరా!

1 Aug, 2018 01:23 IST|Sakshi

అప్పీల్స్‌ ప్యానెల్‌లో నియామకంపై సెహ్వాగ్‌

న్యూఢిల్లీ: జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా)కు చెందిన యాంటీ డోపింగ్‌ అప్పీల్స్‌ ప్యానెల్‌ (ఏడీఏపీ)లో ఇష్టం లేకపోయినా క్రీడల మంత్రి రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ కోరిక మేరకే చేరానని మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ స్పష్టం చేశాడు. ‘నాడా’ గతేడాది నవంబర్‌లో ఏడీఏపీ సభ్యుడిగా సెహ్వాగ్‌ను నియమించింది. ఆటగాళ్ల నిషేధంపై చేసుకున్న అప్పీల్‌ను ఈ ప్యానెల్‌ విచారిస్తుంది. ఇప్పటివరకు పలువురి అప్పీళ్లను విచారించినప్పటికీ ఏ ఒక్క విచారణకు సెహ్వాగ్‌ హాజరు కాలేదు.

దీనిపై వచ్చిన వార్తలపై అతను వివరణ ఇచ్చాడు. ‘నా అభిప్రాయం ప్రకారం క్రికెటర్ల కంటే ఒలింపియన్లనే ‘నాడా’ కమిటీల్లో నియమించాలి. వాళ్లకైతేనే ‘నాడా’ వ్యవహారాలు తెలుస్తాయి. డోపింగ్‌ నిరోధక అంశాలు నాకంటే ఒలింపియన్లకే బాగా తెలుసు. వారే ఈ ప్యానెల్‌ సభ్యులుగా అర్హులు. నాకు ఈ పదవిపై ఇష్టమే లేదు. కానీ... మంత్రి రాథోడ్‌ కోరికను కాదనలేకే సరేనన్నా’ అని సెహ్వాగ్‌ వివరించాడు.  

మరిన్ని వార్తలు