‘ఒక్కసారిగా మరో గేల్‌ అయిపోయా’

13 Apr, 2020 12:22 IST|Sakshi

న్యూఢిల్లీ: నాలుగేళ్ల క్రితం జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ క్రికెట్‌ అభిమానులకు సుపరిచితమే. 2016లో వెస్టిండీస్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగిన ఆనాటి తుది పోరులో బ్రాత్‌వైట్‌ హీరోగా నిలిచాడు.   ఆ ఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్ విజయానికి చివరి 6 బంతుల్లో 19 పరుగులు అవసరమవగా.. ఇంగ్లిష్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌స్టోక్స్ బౌలింగ్‌కి వచ్చాడు.  ఆ సమయంలో కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ క్రీజ్‌లో ఉన్నాడు. కానీ 19 పరుగుల ఛేదన బ్రాత్‌వైట్‌ వల్ల కాదనుకున్నారంతా. అప్పటికి 6 బంతుల్లో 10 పరుగులు చేసిన బ్రాత్‌వైట్‌.. చివరి ఓవర్‌ను మాత్రం ఉతికి ఆరేశాడు. వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టి విండీస్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. దీనిపై బ్రాత్‌వైట్‌ తాజాగా మాట్లాడతూ.. ఆనాటి వరల్డ్‌కప్‌ తర్వాత భారత్‌లోని అభిమానులు క్రిస్‌గేల్‌ తరహాలో చూశారన్నాడు. తనను గేల్‌ తరహాలో అభిమానించారన్నాడు. (ఇప్పుడేం జరుగుతోందని... ఐపీఎల్‌ జరగడానికి! )

దేశంలో ఎక్కడికెళ్లినా తనకు బ్రహ్మరథం పట్టారన్నాడు.  ‘ భార‌త్‌లో క్రికెట్ అనేది మ‌తం. ఓసారి ఎయిర్‌పోర్ట్ నుంచి బ‌య‌టికొస్తుంటే..గేల్ త‌ర‌హాలో అభిమానులు న‌న్ను చుట్టుముట్టారు. ప్రపంచక‌ప్ త‌ర్వాత ఐపీఎల్‌లో ఢిల్లీ త‌ర‌ఫున ఆడేందుకు వ‌చ్చిన‌ప్ప‌డు కూడా ఇదే ప‌రిస్థితి ఎదురైంది’ అని బ్రాత్‌వైట్‌ చెప్పుకొచ్చాడు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ ఏప్రిల్ 15కి వాయిదాపడగా.. ఇప్పటికీ దేశంలో పరిస్థితులు అదుపులోకి రాకపోవడం, లాక్‌డౌన్‌ని కేంద్ర ప్రభుత్వం కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో.. టోర్నీ జరగడం అనుమానంగా మారింది. ఒకవేళ భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) యోచిస్తున్న ప్లాన్‌-బిని అమలు చేస్తే జూలై నెలలో ఈ లీగ్‌ ఆరంభమయ్యే అవకాశం ఉంది. (జడేజా.. ఇక గడ్డి కోసే పనిలో ఉండు..!)

మరిన్ని వార్తలు