ధోని ఆడితే.. నేను ఆడతా: డివిలియర్స్‌

18 May, 2019 13:13 IST|Sakshi

కేప్‌టౌన్‌: భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిపై ప్రత్యేక అభిమానం చాటుకునే విదేశీ ఆటగాళ్లలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ ముందు వరుసలో ఉంటాడు. గతంలో ధోని రిటైర్మెంట్‌కు సంబంధించి ఏబీని ప్రశ్నించగా.. ధోనికి 80 ఏళ్లు వచ్చినా.. తన ఆల్ టైం డ్రీం ఎలెవన్‌లో స్థానం కల్పిస్తానని, వీల్‌చైర్లో ఉన్నా తన జట్టు తరఫున అతను బరిలో దిగుతాడని ఏబీ బదులిచ్చాడు. తాజాగా మరోసారి ధోనిపై అభిమానాన్ని చాటుకున్నాడు డివిలియర్స్‌.  ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో తన రీ ఎంట్రీ గురించి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2023లో జరిగే ప్రపంచకప్‌లో తిరిగి ఆడుతారా..? అని డివిలియర్స్‌ని ప్రశ్నించగా.. ‘ఎంఎస్ ధోని అప్పటికీ ఆడుతూ ఉంటే.. కచ్చితంగా నేను కూడా ఆడతాను’ అని డివిలియర్స్ అన్నాడు.

2018, మే నెలలో ఏబీ డివిలియర్స్‌ అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ వంటి విదేశీ లీగ్‌ల్లో మాత్రమే ఏబీ ఆడుతున్నాడు. అయితే గతేడాది తాను తీసుకున్న ఆకస్మిక నిర్ణయంపై గౌరవ్‌ కపూర్‌ తాజాగా నిర్వహించిన బ్రేక్‌ ఫాస్ట్‌ విత్‌ చాంపియన్స్‌ షోలో పెదవి విప్పాడు. అది అప్పుడు ఉన్న పరిస్థితుల్ని తన రిటైర్మెంట్‌ను ప్రకటించాల్సి వచ్చిందని, అది చాలా సున్నితమైన అంశంగా ఏబీ పేర్కొన్నాడు. 2019లో వరల్డ్‌కప్‌లో ఆడాలని అనుకున్నప్పటికీ పరిస్థితులు అనుకూలించని కారణంగా వీడ్కోలు చెప్పాల్సి వచ్చిందన్నాడు. ఈ క్రమంలోనే 2023 వరల్డ్‌కప్‌లో ఆడతారా? అని అడగ్గా, అప్పటికీ ఎంఎస్‌ ధోని ఆడితే తాను వరల్డ్‌కప్‌ ఆడే విషయంపై పునరాలోచిస్తానన్నాడు. ఆ సమయానికి తనకు 39  ఏళ్లు వస్తాయని, ఒకవేళ వచ్చే వరల్డ్‌కప్‌ నాటికి ధోని ఆడితే(నవ్వుతూ) తాను కూడా మెగాటోర్నీలో పునరాగమనం చేస్తానన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని బట్టి అంతర్జాతీయ క్రికెట్‌లో ధోనికి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుస్తోందని అతని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు