'పిచ్చికూతలకు ఫుల్ స్టాప్ పెట్టండి'

14 Mar, 2017 13:16 IST|Sakshi
'పిచ్చికూతలకు ఫుల్ స్టాప్ పెట్టండి'

సిడ్నీ:ఆస్ట్రేలియా-భారత్ జట్ల టెస్టు సిరీస్ లో భాగంగా ముగిసిన తొలి రెండు టెస్టుల్లో ఆటగాళ్ల మధ్య తరుచు చోటు చేసుకున్న స్లెడ్జింగ్ ప్రమాదకర స్థాయిలో ఉందని ప్రముఖ వ్యాఖ్యాత ఇయాన్ చాపెల్ స్పష్టం చేశాడు. క్రికెట్ ఫీల్డ్ లో శ్రుతి మించిపోతున్న ఈ తరహా  చర్యలను ఆపడానికి ఆయా క్రికెట్ బోర్డులు నడుంబిగించాల్సిన అవసరం ఉందన్నాడు. ఇక నుంచి ఆటగాళ్ల ఆన్ ఫీల్డ్ ఘటనలపై బోర్డు అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు.

'గతంలో ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ల్లో కూడా ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేసుకున్న ఘటనలు అనేకం. అయితే ఆ దూకుడు ఎప్పుడూ పరిధిలోనే ఉండటంతో క్రికెట్ కు  మంచే జరిగేది. ఇప్పడు మాత్రం ఆటగాళ్ల ఆన్ ఫీల్డ్ వ్యవహారాలు తీవ్రస్థాయిలో ఉంటున్నాయి. వారి కారుకూతులకు స్టేడియంలో అంపైర్లు, ప్రేక్షకులే సాక్ష్యం. వారి పిచ్చి కూతలకు ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టండి. ఒకవేళ బోర్డు అధికారులు ఈ తరహా చర్యలను చూస్తూ కూర్చుంటే అది వారి చేతకానితనమే అవుతుంది' అని చాపెల్ పేర్కొన్నాడు. ఇటీవల రెండో టెస్టు సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యహరించిన తీరును చాపెల్ తప్పుబట్టాడు. ఒకసారి విరాట్ తన ఎమోషన్స్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందంటూ హితబోధ చేశాడు.

మరిన్ని వార్తలు