అప్పుడు గెలిచారు.. ఇప్పుడు గెలవండి..!

9 May, 2020 11:58 IST|Sakshi

ఆ ఇద్దర్నీ టీమిండియా తొందరగా ఔట్‌ చేస్తేనే..

ఆస్ట్రేలియా పటిష్టంగా ఉంది: ఇయాన్‌ చాపెల్‌

సిడ్నీ:  ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత జట్టు టెస్టు సిరీస్‌ గెలవాలంటే అది అంత ఈజీ కాదని అంటున్నాడు ఆసీస్‌ గ్రేట్‌ ఇయాన్‌ చాపెల్‌.  భారత అదృష్టం కేవలం ఇద్దరి ఆట తీరుపై మాత్రమే ఆధారపడి ఉందన్నాడు. అది డేవిడ్‌ వార్నర్‌-స్టీవ్‌ స్మిత్‌లేనని ఇయాన్‌ చాపెల్‌ స్పష్టం చేశాడు. వీరిద్దర్నీ తొందరగా పెవిలియన్‌కు పంపితేనే భారత్‌ విజయం సాధించడానికి మార్గం ఏర్పడుతుందన్నాడు. ‘సోనీ టెన్‌ పిట్‌ స్టాప్‌’ షోలో.. భారత్‌-ఆస్ట్రేలియాల తదుపరి సిరీస్‌ గురించి మాట్లాడాడు. గత ఆస్ట్రేలియా పర్యటనలో భారత్‌ టెస్టు సిరీస్‌ సాధించడాన్ని ప్రస్తావిస్తూ అడిగిన ప్రశ్నకు చాపెల్‌ బదులిచ్చాడు. ఆ పర్యటన వేరు, జరగబోయే సిరీస్‌ వేరు అంటూ సమాధానమిచ్చాడు. అప్పుడు గెలిచారు ఓకే, కానీ ఇప్పుడు ఆస్ట్రేలియాలో గెలిచి చూపించాలన్నాడు.(ధావన్‌ ఒక ఇడియట్‌.. స్ట్రైక్‌ తీసుకోనన్నాడు..!)

‘ఈసారి టీమిండియా సిరీస్‌ సాధించడం చాలా కష్టం. సిరీస్‌ సాధించాలంటే టీమిండియా మిక్కిలి శ్రమించక తప్పదు. ఆస్ట్రేలియాలోని పరిస్థితులు టీమిండియా క్రికెటర్లకు బాగా తెలుసు. కానీ ఆస్ట్రేలియాలో ఆసీస్‌ను ఓడించాలంటే దూకుడు మంత్రాన్ని అవలంభించాలి. అది కూడా చాలా గట్టిగా ఉండాలి. గతంలో ఆస్ట్రేలియాకు వచ్చినప్పుడు భారత్‌ బ్యాటింగ్‌ బాలేదు. ఇప్పుడు భారత్‌ బ్యాటింగ్‌ బలోపేతం అయ్యింది. కానీ డేవిడ్‌ వార్నర్‌-స్టీవ్‌ స్మిత్‌లే ఆసీస్‌కు వెన్నుముక. వీరిని తొందరగా ఔట్‌ చేస్తే టీమిండియా పైచేయి సాధిస్తుంది. అప్పుడు విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఒకవేళ వార్నర్‌-స్మిత్‌లు ఎక్కువ సేపు క్రీజ్‌లో ఉంటే మాత్రం ఆసీస్‌దే విజయం’ అని చాపెల్‌ చెప్పుకొచ్చాడు. మరొకవైపు కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు బ్యాటింగ్‌ విభాగం కూడా చాలా బలంగా ఉందన్నాడు. ఇక ఆసీస్‌-భారత్‌ల బౌలింగ్‌ కూడా పటిష్టంగా ఉండటంతో  ఇరు జట్ల  మధ్య ఆసక్తికర పోరు నడుస్తుందని ఆశాభావం  వ్యక్తం చేశాడు. కాగా, ఈ ఏడాది చివర్లో టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో భారత్‌ పర్యటించాల్సి ఉంది. కరోనా వైరస్‌ కారణంగా ఆ పర్యటనకు భారత్‌ వెళుతుందా లేదా అనేది అనుమానమే. అప్పటికి పరిస్థితులు చక్కబడితే ఇరు జట్ల మధ్య సిరీస్‌ జరుగుతుంది. (‘ఆ బ్యాట్‌తో ధోని ఆడొద్దన్నాడు’)

మరిన్ని వార్తలు