ఇండియన్ ‘బాధిత’ లీగ్!

26 Jul, 2013 05:09 IST|Sakshi
ఇండియన్ ‘బాధిత’ లీగ్!

 న్యూఢిల్లీ: ఆరంభ విఘ్నాలను అధిగమించి ఆటగాళ్ల వేలం వరకు వచ్చిన ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)ను ఇప్పుడు అసంతృప్తి ‘జ్వాల’లు చుట్టు ముట్టాయి. వేలంలో  కనీస ధర తగ్గించి తమను అవమానించారంటూ ఇప్పటికే జ్వాల, అశ్విని పొన్నప్ప రచ్చ చేయగా... తాజాగా ఈ జాబితాలో మరో ఇద్దరు ఆటగాళ్లు చేరారు. పురుషుల డబుల్స్ నిపుణులు రూపేశ్ కుమార్, సనవే థామస్ కూడా తమ కనీస ధరను కూడా తగ్గించారని, అవసరమైతే టోర్నీ నుంచి తప్పుకుంటామని హెచ్చరించారు. వీరిద్దరు గతంలో వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానం వరకు చేరుకున్నారు.
 
  ఈ ఇద్దరినీ పుణే పిస్టన్స్ కేవలం 5 వేల డాలర్లకు (దాదాపు రూ. 2 లక్షల 95 వేల చొప్పున) కొనుక్కుంది. ‘ఇది నాకు షాక్‌కు గురి చేసింది. ఆసియా, కామన్వెల్త్ క్రీడలు, థామస్ కప్, సూపర్ సిరీస్‌లు ఆడిన సీనియర్ ఆటగాళ్ల కనీస ధర 15 వేల డాలర్లు ఉంటుందని కాంట్రాక్ట్‌లో స్పష్టంగా సూచించారు.
 
  కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు’ అని రూపేశ్ వ్యాఖ్యానించాడు. గతంలో తానెప్పుడూ వివాదాల్లో తలదూర్చలేదని, అయితే ఈ సారి మౌనంగా ఉండనని అతను అన్నాడు. ‘వేలం తర్వాత ఐబీఎల్ నిర్వాహకులైన స్పోర్టీ సొల్యూషన్స్ సంతకం చేయమని నాకు కాంట్రాక్ట్ పత్రాలు పంపించారు. ఏం చేయాలో తెలీక వాటిని పక్కన పెట్టేశాను. దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాను’ అని రూపేశ్ స్పష్టం చేశాడు. రూపేశ్ డబుల్స్ భాగస్వామి సనవే కూడా వేలంపై ఆవేదన వ్యక్తం చేశాడు. ‘15 వేల డాలర్లకే నేను కాంట్రాక్ట్‌పై సంతకం చేశాను. అయితే మా కనీస ధర 5 వేల డాలర్లకు తగ్గించినట్లు తర్వాత తెలిసింది. దీనిని ఎలా స్వీకరించాలో అర్ధం కావడం లేదు’ అని సనవే అన్నాడు.
 
 సింగిల్స్‌లోనూ అదే తీరు...
 ఐబీఎల్ వేలం వివాదం డబుల్స్‌కే పరిమితం కాలేదు. సింగిల్స్ ఆటగాళ్లు అజయ్ జయరామ్, అనూప్ శ్రీధర్‌లకు కూడా ఈ ‘కనీస ధర’ దెబ్బ పడింది. ప్రస్తుత బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో 24వ స్థానంలో ఉన్న జయరామ్ కనీస ధర ముందుగా కాంట్రాక్ట్‌లో పేర్కొన్న ప్రకారం  30 వేల డాలర్లు ఉండగా అతడిని 25 వేల డాలర్లకే హైదరాబాద్ హాట్‌షాట్స్ తీసుకుంది. మరో వైపు అనూప్ శ్రీధర్ కనీస ధర కూడా 15 వేల డాలర్లుగా నిర్ణయించగా, పుణే పిస్టన్స్ టీమ్ అతడిని కేవలం 6 వేల డాలర్లకే సొంతం చేసుకుంది. ఇక ప్రపంచ 43వ ర్యాంకర్ ఆనంద్ పవార్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు. ‘నిరాశతోపాటు అసంతృప్తికి గురయ్యాను. ఇటీవల ఇండియన్ సూపర్ సిరీస్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకున్నప్పటికీ ఐబీఎల్ వేలంలో నన్నెవరూ కొనుగోలు చేయలేదు. దీనిని దురదృష్టం అనుకోవాలో మరేమైనా అనుకోవాలో అర్ధం కావడంలేదు’ అని ఆనంద్ పవార్ వాపోయాడు.
 
 ఎంత లభించినా గొప్పే!
 అయితే ఐబీఎల్ ప్రారంభానికి ముందు వివాదానికి ముగింపు పలకాల్సిన నిర్వాహకులు మాత్రం ఈ విషయాన్ని చాలా తేలిగ్గా కొట్టి పారేస్తున్నారు. ‘మోసపోయిన’ ఆటగాళ్ల స్పందనను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మన పేద బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు ఎంత మొత్తం లభించినా దానినే ఆనందంగా స్వీకరించాలని వారు భావిస్తున్నారు కాబోలు. పురుషుల సింగిల్స్ ఆటగాడు అరవింద్ భట్ కూడా దాదాపు ఇదే అభిప్రాయంతో ఉన్నాడు. అతడిని బంగా బీట్స్ జట్టు 7,500 డాలర్లకు తీసుకుంది. ‘నా కాంట్రాక్ట్‌లో కనీస ధర ప్రస్తావన లేదు. అయితే నేను సంతృప్తిగా ఉన్నాను. బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు రెండు వారాల్లో ఇక్కడ లభిస్తున్న మొత్తం చాలా ఎక్కువని నేను చెప్పగలను. చాలా ఏళ్ల పాటు జర్మన్ లీగ్‌లో ఆడిన నాకు ఆ విషయం బాగా తెలుసు’ అని అరవింద్ అన్నాడు.
 
 ప్రస్తుతమే ప్రామాణికం: చద్దా
 ఐబీఎల్ వేలంపై కొందరు ఆటగాళ్ల నుంచి అసంతృప్తి పెల్లుబికినప్పటికీ నిర్వాహకులు మాత్రం ఘనమైన గతం కంటే ప్రస్తుత ఆటే ప్రామాణికమని చెబుతున్నారు. ‘రూపేశ్, థామస్‌లకు మంచి రికార్డే ఉంది. ఇందులో ఏ సందేహం లేదు. కానీ... ఇదంతా గతమే! రెండేళ్లుగా వాళ్లిద్దరు సరిగ్గా ఆడటమే లేదు. దీంతో యువ క్రీడాకారులు తెరమీదికొచ్చారు. చక్కగా రాణిస్తూ... మంచి ధరను సొంతం చేసుకున్నారు’ అని స్పోర్టీ సొల్యూషన్స్ చీఫ్ ఆశిష్ చద్దా అన్నారు.
 
 గెలిస్తే బోనస్ పాయింట్...
 ఐబీఎల్ మ్యాచ్‌ల పాయింట్ల విధానాన్ని  ఖరారు చేశారు. రెండు జట్ల మధ్య ముఖాముఖి పోరులో గెలిచే టీమ్‌కు ఒక బోనస్ పాయింట్‌ను ఇవ్వనున్నారు. ఒక టీమ్ 5-0 తేడాతో మ్యాచ్‌లు గెలిస్తే ఐదు పాయింట్లతో పాటు బోనస్ కలిపి మొత్తం 6 పాయింట్లు దక్కుతాయి. 4-1తో గెలిస్తే 5 పాయింట్లు, 3-2తో గెలిస్తే 4 పాయింట్లు లభిస్తాయి. ఇరు జట్ల పోరులో ఓడిన జట్టు కూడా తమ ఖాతాలో పాయింట్లు వేసుకునే అవకాశం ఉంది. ఐదు మ్యాచ్‌ల పోరులో ఎన్ని మ్యాచ్‌లు గెలిస్తే అన్ని పాయింట్లు ఆ టీమ్‌కు దక్కుతాయి. ఉదాహరణకు 2-3తో ఓడితే 2, 1-4తో ఓడితే 1 పాయింట్ చేరుతుంది. రెండు జట్ల మధ్య పోరులో  రెండు పురుషుల సింగిల్స్, ఒక మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లు ఉం టాయి.
 
 ఐబీఎల్ వేలంలో పాల్గొనే ఆటగాళ్ల కోసం నిర్వాహకులు ఒక ప్రత్యేక పద్ధతిని అనుసరించారు. తాజా ర్యాంకింగ్స్‌ను పరిగణనలోకి తీసుకుంటూ భారత ఆటగాళ్లకు పాయింట్లు కేటాయించారు. దాని ప్రకారమే కనీస ధర నిర్ణయించారు. వేలంలో పాల్గొనేందుకు అంగీకారం కోరుతూ ఆటగాళ్లతో కాంట్రాక్ట్‌పై సంతకం చేసే ముందు వారికి ఈ పాయింట్ల వివరాలు అందజేశారు. అయితే అసలు సమయంలో మాత్రం నిర్వాహకులు తమ నిబంధనలకు తామే మంగళం పాడారు. ఈ జాబితా ప్రకారం...
 
 

మరిన్ని వార్తలు