అమెరికా క్రికెట్‌ కెప్టెన్‌గా ఇబ్రహీం ఖలీల్‌

26 Aug, 2018 04:42 IST|Sakshi
ఇబ్రహీం ఖలీల్‌

వాషింగ్టన్‌: ఐసీసీ వరల్డ్‌ టి20 క్వాలిఫయింగ్‌ టోర్నీలో పాల్గొనే అమెరికా జట్టుకు హైదరాబాద్‌కు చెందిన ఇబ్రహీం ఖలీల్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వచ్చే నెల 19 నుంచి నార్త్‌ కరోలినాలో జరిగే ఈ టోర్నీ కోసం 15 మంది సభ్యుల యూఎస్‌ఏ జట్టును సెలక్షన్‌ కమిటీ చైర్మన్, మాజీ వెస్టిండీస్‌ క్రికెటర్‌ రికార్డో పావెల్‌ ప్రకటించారు. హైదరాబాద్‌ తరఫున సుదీర్ఘ కాలం రంజీ ఆడిన అనంతరం యూఎస్‌ఏ వలస వెళ్లిన వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ ఖలీల్‌ ... గత ఏడాది నుంచి జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఇంతకుముందు కూడా జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అతను, మరోసారి సారథిగా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. టోర్నీలో భాగంగా కెనడా, పనామా, హోండురస్‌ జట్లతో అమెరికా తలపడుతుంది. ఇబ్రహీం ఖలీల్‌ ప్రస్తుతం కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌)లో క్రిస్‌ గేల్‌ కెప్టెన్‌గా ఉన్న సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.  

మరిన్ని వార్తలు