‘అతి’కి సస్పెన్షన్‌ పాయింట్లు

12 Feb, 2020 00:41 IST|Sakshi

ఇద్దరు భారత్, ముగ్గురు బంగ్లాదేశ్‌ యువ క్రికెటర్లపై ఐసీసీ చర్యలు

దుబాయ్‌: జెంటిల్‌మెన్‌ క్రికెట్‌కు తమ దురుసు ప్రవర్తనతో మచ్చ తెచ్చిన భారత్, బంగ్లాదేశ్‌ యువ క్రికెటర్లపై అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) చర్యలు తీసుకుంది. అండర్‌–19 ప్రపంచకప్‌ ఫైనల్‌ ముగిశాక ఆటగాళ్ల ప్రవర్తన... లెవెల్‌–3 నియమావళికి విరుద్ధంగా ఉండటంతో ఐసీసీ చర్యలు చేపట్టింది. కప్‌ నెగ్గిన ఆనందంలో ‘అతి’గా సంబరపడిన బంగ్లాదేశ్‌ ఆటగాళ్లపై,  దీనికి దీటుగా ఆవేశపడిన భారత ఆటగాళ్లపై సస్పెన్షన్‌ పాయింట్లు విధించింది. భారత్‌కు చెందిన ఆకాశ్‌ సింగ్‌కు 8 సస్పెన్షన్‌ పాయింట్లు (6 డి మెరిట్‌ పాయింట్లకు సమానం), రవి బిష్ణోయ్‌కి 5 సస్పెన్షన్‌ (2 డి మెరిట్‌) పాయింట్లు విధించారు.

బంగ్లాదేశ్‌ ఆటగాళ్లలో తౌహిద్‌ హ్రిదోయ్‌ (10 సస్పెన్షన్‌=6 డి మెరిట్‌), షమీమ్‌ హుస్సేన్‌ (8 సస్సెన్షన్‌=6 డి మెరిట్‌), రకీబుల్‌ హసన్‌ (4 సస్పెన్షన్‌= 5 డి మెరిట్‌)లపై ఐసీసీ చర్యలు తీసుకుంది. రకీబుల్‌ ప్రవర్తించిన తీరుపై ఎక్కువ డి మెరిట్‌ పాయింట్ల నిషేధం విధించింది. ఆదివారం ఉత్కంఠ పెంచిన ‘లో’ స్కోర్ల మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 3 వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది. తొలిసారి ఐసీసీ ప్రపంచకప్‌ నెగ్గిన ఆనందంలో బంగ్లాదేశ్‌ యువ ఆటగాళ్లు విచక్షణ కోల్పోయారు.

మరిన్ని వార్తలు