ధోని వెనకుండగా.. క్రీజ్‌ వీడడమా?

4 Feb, 2019 10:31 IST|Sakshi
ఎంఎస్‌ ధోని

వెల్లింగ్టన్‌ : టీమిండియా వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోని స్టంప్స్‌ వెనుక ఉంటే.. క్రీజ్‌ వీడవద్దని అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) బ్యాట్స్‌మెన్‌కు సలహా ఇస్తోంది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ధోని.. నీషమ్‌ను తెలివిగా రనౌట్‌ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఐసీసీ బ్యాట్స్‌మెన్‌ను హెచ్చిరించింది. కేదార్‌ జాదవ్‌ వేసిన 37వ ఓవర్‌లో బంతి నీషమ్‌ ప్యాడ్స్‌ తగలగా.. భారత ఆటగాళ్లంతా ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్‌ చేశారు. అందరూ అంపైర్‌ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ బిజీగా ఉండగా.. బంతిని అందుకున్న ధోని అప్పీల్‌ చేస్తూనే నీషమ్‌ను రనౌట్‌ చేశాడు. ఆటగాళ్ల అప్పీల్‌తో క్రీజ్‌ను వదిలి ధోనిని మరిచిన జేమ్స్‌ నీషమ్‌.. భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఆసమయంలో నీషమ్‌ 45 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. కివీస్‌ విజయానికి 83 బంతుల్లో 77 పరుగులు అవసరం. దాటిగా ఆడుతూ క్రీజులో నిలదొక్కుకున్న నీషమ్‌ ధోని దెబ్బకు పెవిలియన్‌ చేరాడు. ఇది ఆతిథ్య జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. ఇలా వికెట్ల వెనుక చాకచక్యంగా వ్యవహరించిన ధోనిపై ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.

ధోని వెనుకాల ఉంటే బ్యాట్స్‌మెన్‌ క్రీజ్‌ వీడడమా? అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఇప్పటికే ధోని తన కెరీర్‌లో ఇలాంటి కళ్లు చెదిరే కీపింగ్‌ స్టంట్స్‌తో మైమరిపించిన సంగతి తెలిసిందే. తాజా ఐదు వన్డేల సిరీస్‌లో కూడా తన కీపింగ్‌ పదునుతో కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించాడు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని ధోని విషయంలో బ్యాట్స్‌మెన్‌కు సలహా ఇవ్వండని ఐసీసీని కోరాడు. దీనికి ఐసీసీ స్పందిస్తూ.. స్టంప్స్‌ వెనుక ధోని ఉన్నాడంటే ఎప్పుడూ క్రీజ్‌ను వీడొద్దు.’ అని సమాధానం ఇచ్చింది. ఇక నీషమ్‌ రనౌట్‌పై అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ విషయంలో కొందరు నీషమ్‌ను నిందిస్తూ కామెంట్స్‌ చేశారు. అభిమానులకు నీషమ్‌ వివరణ ఇచ్చుకున్నాడు. ‘సలహాలిచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను బంతినే చూశాను. కెమెరాలు నా ఐబాల్‌ను కూడా క్యాచ్‌ చేశాయి.’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో భారత్‌ 35 పరుగులతో తేడాతో గెలిచి సిరీస్‌ను 4-1తో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు