‘కరోనా సబ్‌స్టిట్యూట్‌’కు అనుమతి

10 Jun, 2020 00:47 IST|Sakshi

తాత్కాలిక ప్రతిపాదనలకు ఐసీసీ ఆమోదముద్ర

నేడు ఐసీసీ కీలక సమావేశం

దుబాయ్‌: కోవిడ్‌–19 నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూనే క్రికెట్‌ను కొనసాగించేందుకు చేసిన ప్రతిపాదనలకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) పచ్చ జెండా ఊపింది. తాత్కాలిక ప్రాతిపదికన ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని మంగళవారం ప్రకటించింది. ఆటగాళ్ల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూనే మైదానంలో మరికొన్ని సడలింపులు ఇస్తున్నట్లు వెల్లడించింది. అనిల్‌ కుంబ్లే నాయకత్వంలోని ఐసీసీ క్రికెట్‌ కమిటీ ఈ ప్రతిపాదనలు చేసింది. మరోవైపు వచ్చే 12 నెలలపాటు ఆటగాళ్లు ధరించే దుస్తులకు సంబంధించి కూడా ఐసీసీ ఒక సడలింపు ఇచ్చింది. స్పాన్సర్‌షిప్‌కు సంబంధించి ఇప్పటికే అనుమతించిన మూడు లోగోలతో పాటు ఇకపై ఛాతీ భాగంలో కూడా అదనంగా 32 చదరపు అంగుళాలకు మించకుండా మరో లోగోను ప్రదర్శించుకునేందుకు వీలుంది. ఐసీసీ ఆమోదించిన ప్రధాన అంశాలను చూస్తే...

1. కోవిడ్‌–19 రీప్లేస్‌మెంట్‌
 టెస్టు మ్యాచ్‌ జరిగే సమయంలో ఎవరైనా ఆటగాడికి కరోనా లక్షణాలు కనిపిస్తే కన్‌కషన్‌ సబ్‌స్టిట్యూట్‌ తరహాలోనే అతని స్థానంలో మరొకరిని రిఫరీ అంగీకారంతో ఆడించుకోవచ్చు. అయితే ఈ నిబంధన వన్డే, టి20ల్లో వర్తించదు.

2. ఉమ్మి వాడకుండా నిషేధం
ఏ బౌలర్‌ కూడా బంతి మెరుపు పెంచేందుకు సలైవాను వాడరాదు. ఆటగాళ్లు దీనికి అలవాటు పడే వరకు అంపైర్లు కాస్త స్వేచ్ఛనిస్తారు. ఆ తర్వాత హెచ్చరించడం మొదలవుతుంది. రెండు హెచ్చరికల తర్వాత కూడా అదే చేస్తే బ్యాటింగ్‌ జట్టుకు 5 పెనాల్టీ పరుగులు ఇస్తారు. ఉమ్మి వాడినట్లు అంపైర్లు గుర్తిస్తే ఆ బంతిని వేసే ముందే తుడిచేయాలని వారు ఆదేశించగలరు.

3. తటస్థ అంపైర్లు రద్దు
ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర దేశాలకు చెందిన తటస్థ అంపైర్లకు బాధ్యతలు ఇవ్వడం కష్టం కాబట్టి ఆయా క్రికెట్‌ బోర్డులకు చెందిన అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఎలైట్‌ ప్యానెల్‌ అంపైర్లే మ్యాచ్‌ విధులు నిర్వర్తిస్తారు.

4. అదనపు డీఆర్‌ఎస్‌ రివ్యూ
స్థానిక అంపైర్లకు అనుభవం తక్కువగా ఉంటే నిర్ణయాల్లో తప్పులు దొర్లే అవకాశం ఉంటుంది కాబట్టి అదనంగా మరో రివ్యూను ఇస్తారు. దీని ప్రకారం టెస్టుల్లో ఒక్కో ఇన్నింగ్స్‌లో రెండుకు బదులుగా 3 రివ్యూలు ఉంటాయి. వన్డే, టి20ల్లో ఒకటినుంచి రెండుకు పెంచారు.

టి20 ప్రపంచ కప్‌ జరిగేనా!
ఆస్ట్రేలియా వేదికపై ఈ ఏడాది జరగాల్సిన టి20 ప్రపంచకప్‌ నిర్వహణపై నేడు స్పష్టత రానుంది. నేడు జరిగే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. షెడ్యూల్‌ ప్రకారం అక్టోబరు 18 నుంచి నవంబర్‌ 15 వరకు ఈ మెగా టోర్నీ జరగాల్సి ఉంది. నిజానికి మే 28న జరిగిన సమావేశంలోనే ఈ అంశాన్ని తేల్చేస్తారని భావించినా... ఐసీసీ అజెండాలోని అన్ని అంశాలపై నిర్ణయాన్ని జూన్‌ 10కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది ప్రపంచకప్‌ సాధ్యం కాకపోతే ఒక ఏడాది దానిని వాయిదా వేసి భారత్‌లో జరగాల్సిన 2021 వరల్డ్‌ కప్‌ను కూడా మరో సంవత్సరం వెనక్కి జరిపే ప్రతిపాదన కూడా వినిపిస్తోంది.

మరోవైపు ప్రపంచకప్‌ జరిగే అవకాశం లేకపోతే అవే తేదీల్లో ఐపీఎల్‌ను నిర్వహించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. దీనిపై ఒక సీనియర్‌ అధికారి స్పందిస్తూ ఐసీసీ ముందుగా దీనిపై తమ నిర్ణయం ప్రకటిస్తే ఆపై తాము ఏం చేయాలనేది ఆలోచిస్తామని చెప్పారు. దీంతో పాటు ఐసీసీ చైర్మన్‌ పదవి గురించి కూడా ఈ సమావేశం ప్రధానంగా చర్చ జరగనుంది. కొత్త చైర్మన్‌ ఎంపిక కోసం నోటిఫికేషన్‌ ఇవ్వాలా వద్దా అనేదానిపై కూడా నిర్ణయం తీసుకుంటారు. శశాంక్‌ మనోహర్‌ పదవీ కాలం ముగిసిపోగా... ఈ ప్రతిష్టాత్మక పదవి కోసం పలువురు పోటీ పడుతున్నారు. భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కూడా రేసులో ఉన్నాడు.

మరిన్ని వార్తలు