కోహ్లికి అరుదైన గౌరవం

5 Apr, 2016 00:02 IST|Sakshi
కోహ్లికి అరుదైన గౌరవం

ఐసీసీ టి20 ఎలెవన్ కెప్టెన్‌గా ఎంపిక
 

కోల్‌కతా: ప్రపంచకప్‌లో బాగా ఆడిన ఆటగాళ్లతో ఆ టోర్నీకి సంబంధించిన జట్టును ఎంపిక చేయడం ఐసీసీకి ఆనవాయితీ. ఈసారి అలా ఎంపిక చేసిన ఐసీసీ టి20 ఎలెవన్‌కు భారత స్టార్ విరాట్ కోహ్లి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈసారి మ్యాన్ ఆఫ్ ద టోర్నీగా ఎన్నికైన కోహ్లితో భారత్ నుంచి ఆశిష్ నెహ్రా మాత్రమే జట్టులో ఉన్నాడు. ప్రపంచకప్‌లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా నిపుణులతో కూడిన కమిటీ ఈ జట్టును ఎంపిక చేస్తుంది. ఈ జట్టులో ఇంగ్లండ్ నుంచి నలుగురు ఆటగాళ్లకు చోటు దక్కగా... చాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్ జట్టు నుంచి ఇద్దరికే స్థానం లభించింది. మరోవైపు మహిళల జట్టు కెప్టెన్‌గా స్టెఫానీ టేలర్(వెస్టిండీస్) ఎంపికయింది.

ఐసీసీ టి20 జట్టు: కోహ్లి (కెప్టెన్), నెహ్రా (భారత్), రాయ్, రూట్, బట్లర్, విల్లీ (ఇంగ్లండ్), రసెల్, బద్రీ (వెస్టిండీస్), డికాక్ (దక్షిణాఫ్రికా), వాట్సన్ (ఆస్ట్రేలియా), ముస్తాఫిజుర్ (బంగ్లాదేశ్).

ర్యాంకింగ్స్‌లో టాప్‌లోనే...: అంతర్జాతీయ టి20 క్రికెట్ ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌లో స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి తన అగ్రస్థానాన్ని నిలుపుకున్నాడు. ఇటీవలి టి20 ప్రపంచకప్‌లో సూపర్ బ్యాటింగ్‌తో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచిన తను 889 పాయింట్లతో ఇతరులకు అందకుండా ఉన్నాడు. ఆ తర్వాత ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా, 803), గప్టిల్ (న్యూజిలాండ్, 754) ఉన్నారు. కెరీర్‌లో తొలిసారిగా జో రూట్ (ఇంగ్లండ్, 750) నాలుగో స్థానంలో నిలిచాడు.

బౌలర్లలో బద్రీ అగ్రస్థానాన్ని నిలుపుకోగా తాహిర్ (దక్షిణాఫ్రికా), అశ్విన్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. బుమ్రా ఓ స్థానం ఎగబాకి ఆరో స్థానంలో ఉండగా, నెహ్రా ఐదు స్థానాలు మెరుగుపరుచుకుని 11వ ర్యాంకులో ఉన్నాడు. ఇక టీమ్ ర్యాకింగ్స్‌లోనూ భారత జట్టు (126) తమ నంబర్‌వన్ ర్యాంకును కాపాడుకుంది. టి20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న వెస్టిండీస్ (125) ఒక్క పాయింట్ తేడాతో రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

మరిన్ని వార్తలు