ఐసీసీలో తొలి సారిగా..!

9 Feb, 2018 17:34 IST|Sakshi
ఇంద్రానూయి (ఫైల్‌)

స్వతంత్ర మహిళా డైరెక్టర్‌

పెప్సికో చైర్మెన్‌  ఇంద్రానూయి

సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా పేరొందిన  ఇంద్రానూయి చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం పెప్సికో సంస్థకు ఛైర్మన్, సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)లో మరో కీలక పదవిని చేపట్టనున్నారు. ఈ ఐసీసీ బోర్డులోఇంద్రానూయి తొలి స్వతంత్ర మహిళా డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు ఐసీసీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది

ఆమె జూన్‌లో ఐసీసీ స్వతంత్ర ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమె నియామకాన్ని బోర్డు సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదం లభించినట్లు ఐసీసీ వెల్లడించింది. పాలనను మెరుగుపరిచే లక్ష్యంతో బోర్డులోకి కొత్తగా ఒక స్వతంత్ర డైరెక్టర్‌ను తీసుకోవాలని అది కూడా మహిళే అయి ఉండాలని 2017 జూన్‌లో నిర్వహించిన ఐసీసీ మండలి సమావేశంలో పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంలో భాగంగానే ఆమెను స్వతంత్ర మహిళా డైరెక్టర్‌గా నియమించారు.

ఫార్చ్యూన్ మ్యాగజైన్ ప్రకటించే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వంద మంది మహిళా వ్యాపారవేత్తల జాబితాలో వరుసగా ఇంద్రా నూయి చోటు దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. పెప్సికో సీఈఓగా ఇంద్రానూయి బాధ్యతలు చేపట్టిన తర్వాత సంస్థను కొత్తపుంతులు తొక్కించారు. ప్రస్తుతం ఈ సంస్ధ నుంచి మొత్తం 22 రకాల ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లలోకి వస్తున్నాయి. పెప్సికో సంస్థ ఆదాయం ఏడాదికిగాను $1 బిలియన్‌గా ఉంది.

ఈ సందర్భంగా ఐసీసీ ఛైర్మన్ శశాంక్ మనోహర్ మాట్లాడుతూ 'ఇంద్రా నూయి ఐసీసీలోకి వస్తున్నందుకు సంతోషంగా ఉంది. పరిపాలనలో మహిళా డైరెక్టర్‌ను భాగస్వామ్యం చేయబోతున్నాం. ఇదొక కీలక నిర్ణయం. ప్రపంచ వ్యాపార రంగంలో ఆమెకున్న అపార అనుభవం తమకు ఉపయోగపడుతుంది' అని ఆయన అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు