పాక్‌ క్రికెటర్లకు ఐసీసీ వార్నింగ్‌

25 May, 2018 14:18 IST|Sakshi
లార్డ్స్‌ టెస్ట్‌ సందర్భంగా పాక్‌ ఆటగాళ్లు

లండన్‌: పాకిస్థాన్‌ క్రికెటర్లకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) హెచ్చరికలు జారీ చేసింది. స్మార్ట్‌ వాచ్‌లతో మైదానంలోకి అడుగుపెట్టకూడదని తెలిపింది. స్మార్ట్‌ వాచ్‌లతో ఫిక్సింగ్‌కు పాల్పడే ఆస్కారం ఉండటంతో ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పేసర్‌ హసన్‌ అలీ మీడియాకు తెలియజేశాడు. 

ప్రస్తుతం పాక్‌ జట్టు ఇంగ్లాండ్‌ టూర్‌లో ఉంది. గురువారం ఈ రెండు జట్ల మధ్య లార్డ్స్‌ మైదానంలో తొలిటెస్ట్‌ ప్రారంభమైంది కూడా. అయితే ఆట ముగిశాక ఐసీసీ నుంచి పాక్‌ టీమ్‌కు ఆదేశాలు అందాయి. పాక్‌ టీమ్‌ లోని ఇద్దరు ఆటగాళ్లు స్మార్ట్‌ వాచ్‌లతో మైదానంలో కనిపించారని, అది నిబంధనలకు విరుద్ధమని, ఇక నుంచైనా వాటిని వాడొద్దంటూ తెలిపింది. అయితే ఆ ఆటగాళ్ల ఎవరన్నది మాత్రం ఐసీసీ వెలువరించలేదు. మరోపక్క ఐసీసీ తన అఫీషియల్‌ ట్విటర్‌లో స్మార్ట్‌ వాచ్‌ల వాడకంపై ఉన్న నిషేధాన్ని ధృవీకరిస్తూ ఓ ట్వీట్‌ చేసింది.

ఫిక్సింగ్‌కు పాల్పడే అవకాశాలు ఉండటంతో ఎలక్ట్రానిక్‌(కమ్యూనికేషన్‌కు సంబంధించి) డివైజ్‌లను సాధారణంగా మైదానంలోకి అనుమతించరు. గతంలో (2010) పాక్‌ ఆటగాళ్లు సల్మాన్‌ భట్‌, మహ్మద్‌ అసిఫ్‌, మహ్మద్‌ అమీర్‌లు స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడటం, పాక్‌ జట్టు నిషేధం విధించటం, జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు