నిర్లక్ష్యం ఖరీదు.. రెండేళ్ల నిషేధం

29 Oct, 2019 19:04 IST|Sakshi

ఢాకా: బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌, టీ20, టెస్టు సారథి షకీబుల్‌ హసన్‌పై ఐసీసీ నిషేధం విధించింది. రెండేళ్ల క్రితం ఓ అంతర్జాతీయ మ్యాచ్‌కు ముందు బుకీలు అతడిని సంప్రదించారు. అయితే ఈ విషయాన్ని ఐసీసీ అవినీతి నిరోధక భద్రత విభాగానికి, బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు దృష్టికి తీసుకెళ్లలేదు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన షకీబుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఐసీసీ అతడిపై చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా  అతడు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడకుండా రెండేళ్ల నిషేధం విధించింది. అయితే విచారణలో బుకీలు సంప్రదించారన్న విషయాన్ని అంగీకరించినందుకు ఏడాది సస్పెన్షన్‌ తర్వాత క్రికెట్‌ ఆడే వెసులబాటు కల్పించింది. దీంతో వచ్చే ఏడాది అక్టోబర్‌ 29 వరకు షకీబుల్‌ మైదానంలో అడుగుపెట్టడానికి వీలు లేదు.

‘నా ఒక్క చిన్న నిర్లక్ష్యం నేను ఎంతగానో ప్రేమించే క్రికెట్‌కు రెండేళ్ల పాటు దూరం చేసింది. నేను చేసింది పొరపాటే. ఆ విషయాన్ని ఐసీసీ ముందు అంగీకరించా. క్లీన్‌ క్రికెట్‌ ఉండాలని కోరుకునే వారిలో నేను ఒకడిని. నేను చేసిన తప్పు యువ క్రికెటర్లు చేయొద్దన్ని కోరుతున్నా’ అంటూ షకీబుల్‌ పేర్కొన్నాడు. అతడు చేసిన నిర్లక్ష్యానికి ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌ 2020కు దూరమై భారీ మూల్యం చెల్లించుకోనున్నాడు. ఇక షకీబుల్‌ గైర్హాజరీతో టీమిండియా సిరీస్‌ కోసం బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు మార్పులతో కూడిన జట్టును ప్రకటించే అవకాశం ఉంది. 

ఇక గత కొద్ది రోజులుగా బంగ్లాదేశ్‌ క్రికెట్‌లో అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. తమ డిమాండ్ల సాధనకై క్రికెటర్లు సమ్మెకు దిగడంతో యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అయితే క్రికెటర్ల డిమాండ్లకు బీసీబీ అంగీకరించడంతో సమస్య పరిష్కారమైంది. దీంతో కీలక టీమిండియా సిరీస్‌కు సన్నధ్దమవతున్న బంగ్లాకు షకీబుల్‌పై నిషేధం ఊహించని ఎదురుదెబ్బ. గత కొంతకాలంగా ఈ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బంగ్లాదేశ్‌ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అయితే ఈ నిషేధ ప్రభావం యువ క్రికెటర్లపై ముఖ్యంగా ఆ దేశ క్రికెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   

>
మరిన్ని వార్తలు