హఫీజ్ ఎట్టకేలకు పాసయ్యాడు!

12 Dec, 2016 15:12 IST|Sakshi
హఫీజ్ ఎట్టకేలకు పాసయ్యాడు!

కరాచీ: పాకిస్తాన్ బ్యాటింగ్ ఆల్ రౌండర్ మొహ్మద్ హఫీజ్ బౌలింగ్ యాక్షన్పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నుంచి క్లియరెన్స్ లభించింది. గత కొంతకాలంగా బౌలింగ్ పరీక్షల్లో విఫలమవుతున్న హఫీజ్.. తాజాగా నిర్వహించిన బౌలింగ్ టెస్టులో పాసయ్యాడు. ఇటీవల తన బౌలింగ్ శైలిని సరిచేసుకున్న హాఫీజ్.. నవంబర్ 17వ తేదీన ఐసీసీ నిర్వహించిన పరీక్షలకు హాజరయ్యాడు. హఫీజ్ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు లోబడే ఉన్నట్టు ఐసీసీ నివేదికలో పేర్కొంది.

 

దాంతో త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే పాక్ జట్టులో హఫీజ్కు చోటు దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియాకు వెళ్లే పాక్ ప్రాబబుల్స్ జట్టును ప్రకటించినా హఫీజ్ను ఆలస్యంగా అక్కడకు పంపే అవకాశాలు కనబడుతున్నాయి. గతేడాది జూన్లో శ్రీలంకతో గాలేలో జరిగిన మ్యాచ్లో హాఫీజ్ బౌలింగ్ శైలిపై ఫిర్యాదు నమోదైంది. హాఫీజ్ బౌలింగ్ పై ఫీల్డ్ అంపైర్లు అభ్యంతరం వ్యక్తం చేసి ఐసీసీకి ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలోనే హాఫీజ్ బౌలింగ్ పై ఏడాదిపాటు నిషేధం పడింది. కాగా, ఆ తరువాత పలుమార్లు బౌలింగ్ పరీక్షలకు హాఫీజ్ హాజరైనా అందులో సఫలం కాలేదు.

 

అయితే హాఫీజ్ తాజా పరీక్షల్లో పాస్ కావడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు.  ఇది నిజంగా తనకు ఒక శుభవార్త అని స్సష్టం చేశాడు. బౌలర్గా, బ్యాట్స్మన్గా జట్టుకు సేవలందించాలని తాను ఎప్పుడూ కోరుకుంటానన్నాడు.

మరిన్ని వార్తలు