క్రికెట్‌ ఎలా కొనసాగాలి!

21 Apr, 2020 05:23 IST|Sakshi

గురువారం ఐసీసీ సమావేశం

కరోనా నేపథ్యంలో కీలక చర్చ

దుబాయ్‌: మార్చి 13న సిడ్నీలో ప్రేక్షకులు లేకుండా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మధ్య తొలి వన్డే మ్యాచ్‌ జరిగింది. అంతే... ఆ తర్వాత కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ ఆగిపోయింది. ప్రతిష్టాత్మక ఐపీఎల్‌ కూడా నిరవధిక వాయిదా పడింది. కొంత ఎక్కువ, కొంత తక్కువగా తేడా ఉన్నా... మొత్తంగా వివిధ క్రికెట్‌ బోర్డులకు ఆర్థికపరంగా భారీ దెబ్బ పడింది. కోవిడ్‌–19 తాజా పరిణామాల నేపథ్యంలో క్రికెట్‌ భవిష్యత్తుకు సంబంధించి చర్చించేందుకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కీలక సమావేశం నిర్వహించనుంది. ఆన్‌లైన్‌ ద్వారా గురువారం జరిగే ఈ భేటీలో 12 శాశ్వత సభ్య దేశాలు, మూడు అసోసియేట్‌ బోర్డులకు చెందిన చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొంటారు.

అర్ధంతరంగా ఆగిపోయిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ కొనసాగింపు, వివిధ ద్వైపాక్షిక సిరీస్‌లు, ప్రతిపాదిత వన్డే సూపర్‌ లీగ్‌పై ప్రధానంగా చర్చ జరగనుంది. ఆగిపోయిన వివిధ సిరీస్‌ల కోసం కొత్త తేదీలు ఖరారు చేయడం లేదా రద్దుపై తగిన నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. సిరీస్‌ల రద్దుతో ఆర్థికపరంగా వివిధ బోర్డులను ఆదుకునే విషయంపై కూడా మాట్లాడనున్నట్లు సమాచారం. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 ప్రపంచకప్‌ నిర్వహణ అంశమే ప్రధాన ఎజెండా కావచ్చు. ‘కరోనా నేపథ్యంలో క్రికెట్‌ను కాపాడుకోవడమే ప్రస్తుతం మా అందరి లక్ష్యం. కాబట్టి భేషజాల కోసం, సొంత బోర్డుల ఎజెండా కోసం మాత్రమే కాకుండా మళ్లీ క్రికెట్‌ జరిగి అందరికీ మేలు జరిగే నిర్ణయాలు తీసుకోవడం కీలకం’ అని ఐసీసీ సీనియర్‌ అధికారొకరు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు