టీ20 ప్రపంచకప్‌ వాయిదా

20 Jul, 2020 20:18 IST|Sakshi

న్యూఢిల్లీ: అందరూ ఊహించినట్టే జరిగింది. టీ20 ప్రపంచకప్‌ నిర్వహణ వాయిదా పడింది. వచ్చే ఏడాదికి టీ20 వరల్డ్‌కప్‌ను వాయిదా వేస్తున్నట్టు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అధికారికంగా ప్రకటించింది. ఆదివారం జరిగిన వర్చువల్‌ మీటింగ్‌లో టీ20 ప్రపంచ కప్‌ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ఐసీసీ బోర్డు సభ్యులు చర్చించారు. అయితే, కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో నిర్వహణ, ఆటగాళ్ల సంరక్షణ వీలు పడదని సభ్యులు అభిప్రాయపడ్డారు. దీంతో ఐసీసీ ఈ మేరకు వాయిదా నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది అక్టోబర్‌-నవంబర్‌లో టీ20 వరల్డ్‌కప్‌ నిర్వహిస్తామని ఐసీసీ వెల్లడించింది. ఆస్ట్రేలియాలో ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌ మాసాల్లో పొట్టి వరల్డ్‌ కప్‌ నిర్వహించాల్సి ఉండగా.. కరోనా భయాల నేపథ్యంలో వాయిదా తప్పలేదు. కాగా, వచ్చే మూడేళ్లలో టీ20 ప్రపంచ కప్‌ నిర్వహణ తేదీలను ఐసీసీ ప్రకటించింది.

  • 2021 టీ20 ప్రపంచ కప్  2021 అక్టోబర్-నవంబర్ మధ్య నిర్వహిస్తారు. ఫైనల్ మ్యాచ్ 2021 నవంబర్ 14న జరగనుంది.
  • 2022 టీ20 ప్రపంచ కప్ 2022 అక్టోబర్-నవంబర్ మధ్య నిర్వహిస్తారు. ఫైనల్ మ్యాచ్ 2022 నవంబర్ 13న జరగనుంది.
  • 2023 టీ20 ప్రపంచ కప్ 2023 అక్టోబర్-నవంబర్ మధ్య నిర్వహిస్తారు. ఫైనల్ మ్యాచ్ 2023 నవంబర్ 26న జరగనుంది.

ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌ వేదికగా జరిగే ఐసీసీ టీ20 వుమన్‌ వరల్డ్‌ కప్‌ను షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించేందుకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇదిలాఉండగా.. టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ సమయాన్ని ఐపీఎల్‌–13 నిర్వహణకు అనుకూలంగా మార్చుకోవాలని బీసీసీఐ యోచిస్తోంది.
(నాకు బాయ్‌కాట్‌ కోపం తెప్పించారు: సైఫ్‌ అలీఖాన్‌)

మరిన్ని వార్తలు