అఫ్గాన్‌ చివరకు గెలిచింది 

11 Mar, 2018 00:32 IST|Sakshi

బులవాయో: ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో అఫ్గానిస్తాన్‌ తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో నేపాల్‌పై 6 వికెట్లతో గెలిచింది. ఇక ఆ జట్టు సూపర్‌సిక్స్‌ అవకా శాలు  ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉన్నాయి. హాంకాంగ్‌తో నేడు (ఆదివారం) జరిగే పోరులో నేపాల్‌ గెలిస్తేనే అఫ్గానిస్తాన్‌ సూపర్‌ సిక్స్‌కు చేరుతుంది. ఒక వేళ ఓడితే గెలిచిన హాంకాంగ్‌ జట్టే ముందంజ వేస్తుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన నేపాల్‌ 49.5 ఓవర్లలో 194 పరుగుల వద్ద ఆలౌటైంది.

పారస్‌ ఖడ్కా (75; 10 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మొహమ్మద్‌ నబీ 4  వికెట్లు పడగొట్టారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్‌ 38.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసి గెలిచింది. నజీబుల్లా జద్రాన్‌ (52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీ చేశాడు. నేపాల్‌ బౌలర్‌ దీపేంద్ర సింగ్‌ ఐరి 2 వికెట్లు తీశాడు. మిగతా మ్యాచ్‌ల్లో వెస్టిండీస్‌ 52 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై గెలుపొందగా, నెదర్లాండ్స్‌ 57 పరుగుల తేడాతో పపువా న్యూగినియాపై నెగ్గింది. ఆతిథ్య జింబాబ్వే 89 పరుగుల తేడాతో హాంకాంగ్‌పై ఘనవిజయం సాధించింది.   

మరిన్ని వార్తలు