ఆ విషయంలో ధర్మసేనది తప్పులేదు : ఐసీసీ

27 Jul, 2019 20:44 IST|Sakshi

దుబాయ్‌ : ప్రపంచకప్‌ ఫైనల్లో చోటుచేసుకున్న ఓవర్‌త్రో వివాదాస్పదంపై అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) స్పందించింది. ఈ విషయంలో అంపైర్‌ కుమార ధర్మసేనది ఏ మాత్రం తప్పులేదని వెనకేసుకొచ్చింది. ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన ఉత్కంఠకర ఫైనల్‌ మ్యాచ్‌లో చోటుచేసుకున్న ఓవర్‌త్రో ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఆఖరి ఓవర్లో మార్టిన్‌ గప్టిల్‌ విసిరిన బంతి బెన్‌స్టోక్స్‌ బ్యాట్‌కు తగిలి బౌండరీకి వెళ్లడం.. ఫీల్డ్‌ అంపైర్‌ ధర్మసేన 6 పరుగులివ్వడం తెలిసిందే. అయితే నిబంధనల ప్రకారం ఐదు పరుగులు ఇవ్వాలని ధర్మసేన అత్యుత్సాహంతో 6 పరుగులిచ్చి న్యూజిలాండ్‌ ఓటమికి కారణమయ్యాడని అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో ధర్మసేన తన తప్పును అంగీకరించాడు. కానీ తన నిర్ణయం పట్ల పశ్చాతాపం మాత్రం వ్యక్తం చేయనన్నాడు.

ఇక తాజాగా ఈ వివాదంపై  ఐసీసీ జనరల్‌ మేనేజర్‌ (క్రికెట్‌) జియోఫ్‌ అలార్డిస్‌ స్పందించాడు. ఈ విషయంలో ఫీల్డ్‌ అంపైర్ల తప్పేం లేదన్నాడు. ‘ ఆ రోజు ఫీల్డ్‌ అంపైర్లు సరైన విధానంలోనే నిర్ణయం ప్రకటించారు. ఫీల్డర్‌ త్రో వేసే సమయానికి బ్యాట్స్‌మన్‌ ఇద్దరు ఒకరినొకరు దాటారని భావించి, పద్దతి ప్రకారం చర్చించుకునే ఆ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ సమయంలో బ్యాట్స్‌మెన్‌ ఒకరినొకరు దాటారా? లేరా? అనే నిబంధనపై వారికి అవగాహన ఉండటం గొప్ప విషయం. కానీ ఆ పరిస్థితులు థర్డ్‌ అంపైర్‌ను సమీక్ష కోరే అవకాశాన్ని ఇవ్వవు. ఇక ఫీల్డ్‌ అంపైర్లు తుది నిర్ణయం ప్రకటించాక, అది తప్పని మ్యాచ్‌ రిఫరీ జోక్యం చేసుకోలేడు’ అని చెప్పుకొచ్చారు.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా