అప్పుడు బౌండరీలు... ఇప్పుడు లీగ్‌ పాయింట్లు!

6 Mar, 2020 10:17 IST|Sakshi

మెగా టోర్నీలలో ఐసీసీ నిర్వహణా వైఫల్యం

సిడ్నీ: గత ఏడాది పురుషుల వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లండ్‌ జట్టు ‘బౌండరీ కౌంట్‌’ ద్వారా గెలుచుకున్నప్పుడు న్యూజిలాండ్‌ జట్టు గుండె బద్దలైంది. ఇదేం నిబంధన అంటూ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)పై క్రికెట్‌ ప్రపంచం ధ్వజమెత్తింది. అయితే నిబంధనల ప్రకారమే గెలిచాం కాబట్టి మమ్మల్ని తప్పు పట్టవద్దంటూ ఇంగ్లండ్‌ పదే పదే చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఐసీసీ పెట్టిన ‘నో రిజర్వ్‌ డే’ నిబంధన అదే ఇంగ్లండ్‌ మహిళల జట్టు కొంప ముంచింది. టి20 ప్రపంచకప్‌లోనే కాకుండా ఓవరాల్‌గా కూడా భారత్‌పై ఉన్న ఘనమైన రికార్డు, తాజా ఫామ్‌ను బట్టి ఈ మ్యాచ్‌లో గెలవగలమని భావించిన ఇంగ్లండ్‌కు నిరాశ తప్పలేదు. ఈ నిష్క్రమణ అనంతరం టీమ్‌ కెప్టెన్‌ హెథర్‌ నైట్‌తో సహా మాజీ క్రికెటర్లు మైకేల్‌ వాన్, స్టువర్ట్‌ బ్రాడ్‌లు రిజర్వ్‌ డే లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. రెండు సందర్భాల్లోనూ ఐసీసీ పనితీరుపైనే సందేహాలు రేకెత్తాయి. (అలా అయితే కష్టమయ్యేది: హర్మన్‌ప్రీత్‌)

మన వన్డే కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ చెప్పినట్లు సగటు భారత అభిమానిగా భారత్‌ ఫైనల్‌ చేరడం సంతోషం కలిగిస్తున్నా... ఇలా ఆడకుండా ముందుకు వెళ్లడం మాత్రం నిరాశపర్చే అంశం. అసలు టి20 ప్రపంచ కప్‌ అంటే తక్కువ వ్యవధిలో ముగిసిపోవాలి కాబట్టి రెండు సెమీస్‌లకు రిజర్వ్‌ డే అంటే కష్టం అంటూ ఐసీసీ ఇచ్చిన వివరణే హాస్యాస్పదం. ప్రపంచకప్‌లాంటి టోర్నీ రెండు రోజులు పెరిగినా ఎవరికీ అభ్యంతరం ఉండదు. అయితే టోర్నీకి ముందు నిబంధనల గురించి కెప్టెన్ల అంగీకారం తీసుకునే విషయంలోనే అసలు సమస్య ఉంది. మనం ఫోన్‌లో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేటప్పుడో, ఏదైనా వెబ్‌సైట్‌లు వీక్షించేందుకు ప్రయత్నించినప్పుడు పైనుంచి కింది వరకు సుదీర్ఘ నిబంధనలు ఉంటే అవేవీ చదవకుండా చివర్లో ‘ఐ అగ్రీ’ అంటూ ఓకే చేయడం అందరికీ అనుభవమే! వరల్డ్‌ కప్‌ విషయంలోనూ అలాగే జరిగినట్లు అనిపించింది. వివరాలు ఏమీ తెలియకుండా, ప్రశ్నలు అడగకుండా కెప్టెన్లు సంతకం చేసేశారు. (ఆసీస్‌ ఆరోసారి...)

ఇప్పుడు రిజర్వ్‌ డే గురించి అడిగితే ఇది చూపించి నిబంధనల్లో లేదని, అందరూ అంగీకరించారని చెబుతూ ఐసీసీ తప్పించుకుంది. మరో మాజీ క్రికెటర్‌ ఇయాన్‌ బిషప్‌ మాత్రం ఇది అందరికీ ఒక పాఠం కావాలంటూ సూచన చేశాడు. ‘ఇకపై ఏదైనా టోర్నీ ప్రారంభానికి ముందు నిబంధనలు పూర్తిగా చదువుకోవాలని ఆటగాళ్లు, క్రికెట్‌ బోర్డులకు తెలియాలి. అయితే నిజాయితీగా చెప్పాలంటే అదృష్టాన్ని నమ్ముకోకుండా మెగా టోర్నీలో మీ రాతను మీరే రాసుకోమని కూడా ఇది నేర్పించింది. నాకౌట్‌ మ్యాచ్‌లకే కాదు... టోర్నీ ఆరంభంలోనూ బాగా ఆడాల్సిన అవసరం ఉందని అర్థమైంది. ఇది చూపించి ముందంజ వేసిన భారత్‌కు అభినందనలు’ అని బిషప్‌ వ్యాఖ్యానించాడు.  వర్షం వెంటాడినా సరే... అదృష్టవశాత్తూ కుదించిన మ్యాచ్‌తోనైనా సరే ఆతిథ్య ఆస్ట్రేలియా ఫైనల్‌ చేరింది. ఆ మ్యాచ్‌ కూడా రద్దయి ఉంటే ఇంగ్లండ్‌లాగే ఆసీస్‌ కూడా నిష్క్రమించాల్సి వచ్చేది.

>
మరిన్ని వార్తలు