వివాదంలో కోహ్లీ.. స్పందించిన ఐసీసీ!

2 Nov, 2017 15:15 IST|Sakshi
కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌ సందర్భంగా వాకీ టాకీతో విరాట్ కోహ్లీ

వాకీ టాకీ వాడిన విరాట్ కోహ్లీ

నిబంధనలు ఉల్లంఘించాడంటూ ఆరోపణలు

సాక్షి, న్యూఢిల్లీ: పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ విరాట్ కోహ్లీ సేన ఇక్కడి ఫిరోజ్ షా కోట్ల కోట్ల మైదానంలో బుధవారం జరిగిన తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తమకు గతంలో సాధ్యంకాని విజయాన్ని సాధించి, టీమిండియా ఆస్వాదిస్తుండగా కెప్టెన్ కోహ్లీ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. డగౌట్ లో జట్టు సభ్యులతో కూర్చున్న కోహ్లీ వాకీ టాకీ వాడకంపై విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా కోహ్లీ ప్రవర్తించాడంటూ భారీ ఎత్తున ప్రచారం జరిగింది. కేవలం జట్టు సహాయక సిబ్బంది మాత్రమే డగౌట్‌లో గానీ, లేక డ్రెస్సింగ్ రూమ్‌లో గానీ ఆటగాళ్లను సంప్రదించేందుకు వాకీ టాకీ వినియోగిస్తారని.. కోహ్లీ ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ప్రత్యర్థి కివీస్ జట్టుకు సైతం అనుమానాలు తలెత్తేలా విషయాన్ని రాద్ధాంతం చేయగా ఐసీసీకి చెందిన ఓ అధికారి దీనిపై వివరణ ఇచ్చారు.

ఆ వాకీ టాకీ వినియోగించడానికి భారత కెప్టెన్ కోహ్లీ సంబంధిత అధికారిని అడిగి పర్మిషన్ తీసుకున్నారని ఐసీసీ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఐసీసీ అవినీతి నిరోధక భద్రతా విభాగం అనుమతితోనే కోహ్లీ వాకీ టాకీలో సంభాషించాడని వెల్లడించడంతో వివాదం సద్దుమణిగింది. సెల్ ఫోన్లను డ్రెస్సింగ్ రూములో నిషేధించారు, అయితే ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఐసీసీ నిబంధనల ప్రకారం వాకీ టాకీ వాడవచ్చునని తెలియకపోవడంతోనే కోహ్లీపై దుష్ప్రచారం జరిగినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు