ఇది ఎప్పుడైనా విన్నారా?: ఐసీసీ

28 Sep, 2019 11:45 IST|Sakshi

కరాచీ:  పాకిస్తాన్‌-శ్రీలంక జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా తొలి వన్డే భారీ వర్షం కారణంగా రద్దయ్యింది. శుక్రవారం జరగాల్సిన మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కల్గించడం ఆ మ్యాచ్‌ రద్దయ్యింది. కనీసం టాస్‌ కూడా పడకుండానే మ్యాచ్‌ రద్దు కావడంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. కాగా, ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్‌ 29(ఆదివారం) రెండో వన్డే జరగాల్సి ఉండగా, దాన్ని మరుసటి రోజుకు వాయిదా వేసింది పీసీబీ. ఆదివారం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందనే అంచనాతో ఆ మ్యాచ్‌ను  సోమవారం(సెప్టెంబర్‌30) నాటికి జరిపింది. అయితే వర్షం కురుస్తుందనే సూచనతో మ్యాచ్‌ను మరుసటి రోజుకు వాయిదా వేయడంపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) తన దైన శైలిలో చమత్కరించింది.

‘ఇలా వర్షం కారణంగా ఒకే వేదికలో జరగాల్సిన ఒక గేమ్‌ రెండో రోజులు వర్షార్పణం అవుతుందనే విషయాన్ని ఎప్పుడైనా విన్నారా’ అంటూ ట్వీట్‌ చేసింది. ప్రధానంగా సెప్టెంబర్‌ 28, 29 తేదీల్లో సైతం వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దు అవుతుందనే విషయాన్ని పీసీబీ ఊహించడాన్ని ఐసీసీ వ్యంగ్యంగానే ప్రశ్నించినట్లే కనబడుతుంది. శ్రీలంకతో ద్వైపాక్షిక సిరీస్‌లో మూడు వన్డేలూ కరాచీ వేదికగా జరగాల్సి ఉంది. శుక్రవారం తొలి వన్డే, ఆదివారం రెండో వన్డే జరగాల్సి ఉంది. అయితే భారీ వర్షాలు కురుస్తుండటంతో మ్యాచ్‌ షెడ్యూల్‌లో మార్పులు చేసింది పీసీబీ.

మరిన్ని వార్తలు