పుణే పిచ్‌ నాసిరకం

1 Mar, 2017 05:27 IST|Sakshi
పుణే పిచ్‌ నాసిరకం

నివేదిక ఇచ్చిన మ్యాచ్‌ రిఫరీ
బీసీసీఐ వివరణ కోరిన ఐసీసీ


పుణే: ఊహించినట్లుగా పుణే పిచ్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు జరిగిన ఈ పిచ్‌ను నాసిరకమైనదిగా ఐసీసీ రేటింగ్‌ ఇచ్చింది. టెస్టు ముగిసిన అనంతరం మ్యాచ్‌ రిఫరీ క్రిస్‌ బ్రాడ్‌ తన నివేదికను ఐసీసీకి అందజేశారు. ‘ఐసీసీ పిచ్, అవుట్‌ ఫీల్డ్‌ నిర్వహణకు సంబంధించిన క్లాజ్‌–3 ప్రకారం బ్రాడ్‌ ఐసీసీకి నివేదిక ఇచ్చారు. ఇందులో పుణే పిచ్‌ నాణ్యతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు’ అని ఐసీసీ ప్రకటించింది. ఈ నివేదికను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి పంపించామని, దీనిపై స్పందించేందుకు 14 రోజుల గడువు ఇచ్చినట్లు కూడా ఐసీసీ వెల్లడించింది. బీసీసీఐ ఇచ్చే వివరణను ఐసీసీ జనరల్‌ మేనేజర్‌ (క్రికెట్‌) జెఫ్‌ అలార్డిస్, రంజన్‌ మదుగలే సమీక్షిస్తారు. తుది సమీక్షలో పుణే పిచ్‌ కనీస ప్రమాణాలను పాటించలేదని తేలితే తొలి టెస్టు మ్యాచ్‌ కాబట్టి హెచ్చరికతో వదిలేయడం లేదా అత్యధికంగా 15 వేల డాలర్ల జరిమానా పడే అవకాశం ఉంది.

ఈ నెల 23 నుంచి 25 వరకు మూడు రోజుల్లోపే ముగిసిన పుణే టెస్టులో భారత్‌ 333 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. తొలి రోజు నుంచే ఈ వికెట్‌పై బంతి అనూహ్యంగా స్పిన్‌ అయింది. ఇరు జట్లు కలిపి కోల్పోయిన మొత్తం 40 వికెట్లలలో 31 వికెట్లను స్పిన్నర్లే పడగొట్టారు. 2015 డిసెంబర్‌లో కూడా ఇదే తరహాలో నాగ్‌పూర్‌ పిచ్‌ను కూడా ఐసీసీ తప్పుపట్టింది. మూడు రోజులకే ముగిసిన ఆ మ్యాచ్‌లో కూడా భారత్‌ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తుగా ఓడింది.

ఆరు రకాలుగా విభజన...
అంతర్జాతీయ పిచ్‌లను నాసిరకం (పూర్‌)గా గుర్తించే ముందు ఐసీసీ కొన్ని ప్రమాణాలు పాటిస్తుంది. టెస్టు మ్యాచ్‌ పిచ్‌కు రేటింగ్‌ ఇవ్వడంలో ఆరు రకాల కేటగిరీలు ఉన్నాయి. వెరీ గుడ్, గుడ్, అబోవ్‌ యావరేజ్, బిలో యావరేజ్, పూర్, అన్‌ఫిట్‌ అనే కేటగిరీలు ఉన్నాయి. ఇందులో పిచ్‌ ప్రమాదకరంగా ఉంటే అన్‌ఫిట్‌గా తేలుస్తారు. ఇప్పుడు పుణే పిచ్‌ను ఐసీసీ పూర్‌ కేటగిరీలో చేర్చింది. ఇందు కోసం నాలుగు అంశాలు ప్రామాణికంగా ఉంటాయి.

మ్యాచ్‌లో ఏ దశలోనైనా బంతి సీమ్‌ గమనం చాలా ఎక్కువగా ఉండటం.
మ్యాచ్‌లో ఏ దశలోనైనా పిచ్‌పై బౌన్స్‌లో తేడాలు చాలా ఎక్కువగా ఉండటం.
మ్యాచ్‌ ప్రారంభంలోనే పిచ్‌ స్పిన్‌ బౌలర్లకు చాలా ఎక్కువగా సహకరించడం.
మ్యాచ్‌లో ఏ దశలోనైనా పిచ్‌పై అసలు ఏమాత్రం బంతి సీమ్, టర్న్‌ కాకపోవడం లేదా అసలు బౌన్స్‌ లేకపోవడం. ఈ రకంగా బ్యాటింగ్, బౌలింగ్‌ మధ్య సమతూకాన్ని ఏ మాత్రం పాటించకపోవడం అంటే బౌలర్లను దెబ్బ తీయడమే. 

మరిన్ని వార్తలు