చాంపియన్స్ ట్రోఫీకి చెక్?

20 Jun, 2017 16:03 IST|Sakshi
చాంపియన్స్ ట్రోఫీకి చెక్?

లండన్: ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి  అభిమానుల్ని ఊరిస్తున్న చాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి ఇక ఫుల్ స్టాప్ పడనుందా?, ట్వంటీ 20ల ప్రభావంతో చాంపియన్స్ ట్రోఫీకి చెక్ పడనుందా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ చేసిన వ్యాఖ్యలు అందుకు ఊతన్నిస్తున్నాయి. ఐసీసీ నిర్వహించే రెండు 50 ఓవర్ల టోర్నమెంట్లు వల్ల పెద్దగా ప్రయోజనం లేదనే అభిప్రాయాన్ని రిచర్డ్స్ సన్ తన మాటల ద్వారా వెల్లడించారు.  భవిష్యత్తులో మరిన్ని క్రికెట్ జట్లు ట్వంటీ 20 క్రికెట్ ఆడే క్రమంలో ఎక్కువగా వన్డే టోర్నీలు అనవసరంగా ఆయన పేర్కొన్నారు. కేవలం నాలుగేళ్లకొకసారి జరిగే వన్డే వరల్డ్ కప్ ను మాత్రమే కొనసాగించాలనుకుంటున్నట్లు ఆయన సూచాయగా పేర్కొన్నారు. భవిష్యత్తులో 16 నుంచి 20 జట్లు వరకూ క్రికెట్ ఆడే అవకాశం ఉండటంతో అది ట్వంటీ 20ల ద్వారానే సాధ్యమవుతుందని రిచర్డ్స్ సన్ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీని రద్దు చేసి.. ఆ టోర్నీ జరిగే కాలంలో రెండు వరల్డ్ ట్వంటీ 20లను నిర్వహించాలనేది ఆయన మాటల్లో ఉద్దేశంగా కనబడుతోంది. వరల్డ్ ట్వంటీ 20 టోర్నీలకు అన్ని రకాలుగా విపరీతమైన క్రేజ్ ఉండటమే ఇందుకు ప్రధానం కారణం. మరొకవైపు ఎక్కువ జట్లకు క్రికెట్ ఆడే అవకాశం కల్పించాలనేది కూడా ఐసీసీ ఉద్దేశం. ఇదిలా ఉంచితే, ఐసీసీ ముందస్తు షెడ్యూల్ ప్రకారం తదుపరి చాంపియన్స్ ట్రోఫీకి భారత్  ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఒకవేళ ఈ టోర్నమెంట్ ను రద్దు చేసిన పక్షంలో ఆ స్థానంలో ట్వంటీ 20 వరల్డ్ కప్ లు మాత్రమే మనకు కనువిందు చేస్తాయి.
 

మరిన్ని వార్తలు