టి20 ప్రపంచకప్‌ భవితవ్యం తేలేది నేడే

20 Jul, 2020 00:38 IST|Sakshi

ఐసీసీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం

మెగా ఈవెంట్‌ను వాయిదా వేస్తారని బీసీసీఐ ఆశాభావం

దుబాయ్‌: టి20 ప్రపంచకప్‌ వాయిదాపై అధికారిక ప్రకటన వస్తే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)పై తమ కార్యాచరణ ఉంటుందని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) చెప్పకనే చెబుతోంది. మెగా ఈవెంట్‌ వాయిదాపై నేడు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) నుంచి స్పష్టమైన నిర్ణయం వస్తుందని బోర్డు ఆశిస్తోంది. రెండు నెలలుగా పలుమార్లు సమావేశమైన ఐసీసీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు ఏ నిర్ణయం తీసుకోకుండానే నాన్చుతూ వచ్చింది. కానీ ఇంతలోపే ఆతిథ్య ఆస్ట్రేలియా తమ దేశం లో మెగా ఈవెంట్‌ నిర్వహించే పరిస్థితి లేదని చెప్పేసింది. దీంతో ఐసీసీ వాయిదా ప్రకటన తప్ప చేయగలిందేమీ లేదు. సోమవారం జరిగే సమావేశంలో ఈ నిర్ణయం వెలువడితే ఆ మెగా ఈవెంట్‌ షెడ్యూల్‌ సమయాన్ని ఐపీఎల్‌–13కు అనుకూలంగా మార్చుకోవాలని బీసీసీఐ ప్రణాళికతో ఉంది. 

కుదించైనా నిర్వహించాలనేదే లక్ష్యం... 
షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15 వరకు ఆసీస్‌లో ప్రపంచకప్‌ ఈవెంట్‌ జరగాలి. ఇప్పుడీ సమయంలో ఐపీఎల్‌ను నిర్వహించేందుకు బోర్డు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వేదికను కూడా సిద్ధం చేసుకుంది. కుదించైనా సరే లీగ్‌ను ముగించాలనే పట్టుదలతో ఉంది. ఈ విషయాన్ని బోర్డు అధ్యక్షుడు గంగూలీ స్పష్టంగా చెప్పాడు కూడా! ఈసారి ఐపీఎల్‌ విదేశాల్లోనే జరుగుతుందని ‘దాదా’ ఇదివరకే స్పష్టతనిచ్చాడు. ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ నుంచి ఆసియా కప్‌ రద్దు ప్రకటనను ఇప్పించాడు. ఇవన్నీ కూడా ఐపీఎల్‌ తంతు కోసమే! ఈసారి లీగ్‌ జరగకపోతే బోర్డుకు రూ. 4000 కోట్ల నష్టం వస్తుంది. 

వైరస్‌ ఉధృతి వల్లే బయట... 
దేశంలో రోజురోజుకీ వైరస్‌ విజృంభిస్తోంది. బీసీసీఐ సమావేశానికి ముందు రోజే  10 లక్షల మార్క్‌ను దాటింది. దీంతో భారత్‌లో లీగ్‌కు అవకాశమే లేదని గ్రహించిన బీసీసీఐ విదేశీ ఆతిథ్యంపై తెరవెనుక పనులు చకచకా చక్కబెట్టెస్తోంది. దీనిపై బోర్డు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ‘తొలి అడుగు ఆసియా కప్‌ వాయిదాతో పడింది. ఇక టి20 మెగా ఈవెంట్‌పై అధికారిక ప్రకటన వస్తే మా తదుపరి కార్యాచరణ ఉంటుంది. మా ప్రణాళికను ముందుకు తీసుకెళ్లాలంటే ఐసీసీ ప్రకటన రావాలి’ అని అన్నారు. నేడు జరిగే ఐసీసీ సమావేశంలో స్వతంత్ర చైర్మన్‌ ఎన్నికపై కూడా చర్చించే అవకాశముంది.

>
మరిన్ని వార్తలు