రెండో ర్యాంక్‌కు భారత్‌ 

5 Feb, 2019 02:18 IST|Sakshi

 ‘టాప్‌’లోనే కోహ్లి, బుమ్రా   

దుబాయ్‌: న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 4–1తో గెలుచుకున్న భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ర్యాంకింగ్స్‌లో ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుంది. సోమవారం ప్రకటించిన ఈ ర్యాంక్‌ల్లో భారత్‌ మూడో స్థానం నుంచి రెండో స్థానానికి (122 పాయింట్లు) ఎగబాకింది. ఇంగ్లండ్‌ (126) అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. చివరి రెండు వన్డేలు ఆడకపోయినా వన్డే బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో విరాట్‌ కోహ్లి (887 పాయింట్లు) అగ్రస్థానానికి ఢోకా లేకుండా పోయింది. రోహిత్‌ శర్మ (854) రెండో స్థానంలో ఉండగా, శిఖర్‌ ధావన్‌ 10వ స్థానానికి పడిపోయాడు.  బౌలర్ల జాబితాలో బుమ్రా (808 పాయింట్లు) నంబర్‌వన్‌గా ఉన్నాడు. ట్రెంట్‌ బౌల్ట్‌ 10 నుంచి 3వ ర్యాంక్‌కు చేరుకోవడం విశేషం.  భారత్‌ నుంచి కుల్దీప్‌ యాదవ్‌ (4), చహల్‌ (5) టాప్‌–10లో కొనసాగుతున్నారు.   

బోర్డు ప్రెసిడెంట్‌ ఎలెవన్‌ విజయం 
తిరువనంతపురం: ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరిగిన రెండు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ జట్టు 152 పరుగులతో ఘన విజయం సాధించింది. సోమవారం బోర్డు జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌ను 6 వికెట్లకు 246 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. ఇషాన్‌ కిషన్‌ (55), రికీ భుయ్‌ (51), అక్షత్‌ రెడ్డి (49) రాణించారు. అనంతరం 30 ఓవర్లలో 236 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లయన్స్‌ 2 వికెట్లకు 83 పరుగులు మాత్రమే చేయగలిగింది.  

మరిన్ని వార్తలు