అంపైర్లకు ఐసీసీ మద్దతు

21 Mar, 2015 00:52 IST|Sakshi

మెల్‌బోర్న్: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన ప్రపంచకప్ క్వార్టర్స్‌లో వెలువడిన అంపైరింగ్ నిర్ణయాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సమర్థించుకుంది. ఆ మ్యాచ్‌లో అంపైర్ తప్పుడు నిర్ణయాలతో తమ జట్టు ఓడిందని బంగ్లాదేశ్‌కు చెందిన ఐసీసీ అధ్యక్షుడు ముస్తఫా కమల్ ఆరోపించారు. అయితే ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్‌సన్ అన్నారు. ‘ముస్తఫా వ్యాఖ్యలు దురదృష్టకరం. ఐసీసీ మ్యాచ్ అధికారులపై విమర్శలు చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. అవి ఆయన వ్యక్తిగతంగా భావిస్తున్నాం. ఏదేమైనా మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయమే ఫైనల్’ అని రిచర్డ్‌సన్ స్పష్టం చేశారు.  
 
‘ఐసీసీ ముందు ఉంచాలి: బీసీసీఐ
మరోవైపు బీసీబీ నిరసనలపై బీసీసీఐ స్పందిం చింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సమావేశంలో లేవనెత్తవచ్చని ఐసీసీ అధ్యక్షుడు ముస్తఫా కమల్‌కు బోర్డు సూచించింది. ‘చాలా ముఖ్యమైన విషయాలను కమాల్ లేవనెత్తారు. ఈ అంశాన్ని కూడా ఐసీసీ సమావేశాల్లో ఆయన చర్చించాలి’ అని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

మరిన్ని వార్తలు