ఎటూ తేల్చలేదు

11 Jun, 2020 00:07 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌ భవితవ్యంపై ఐసీసీ తర్జనభర్జన

మరో నెల రోజులు వేచి చూడాలని నిర్ణయం

దుబాయ్‌: ఈ ఏడాది అక్టోబర్‌–నవంబర్‌లలో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 ప్రపంచకప్‌ నిర్వహణకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) వాయిదాల పర్వం కొనసాగుతోంది. బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన సమావేశంలో మరోసారి ఐసీసీ ఎటూ తేల్చలేకపోయింది. ప్రపంచకప్‌ విషయంలో తుది నిర్ణయం తీసుకునేందుకు మరో నెల రోజుల పాటు వేచి చూడాలని నిర్ణయించింది. టి20 ప్రపంచకప్‌తో పాటు 2021లో మహిళల వన్డే వరల్డ్‌ కప్‌లను షెడ్యూల్‌ ప్రకారం ఎలా నిర్వహించాలనే ప్రణాళికలతో పాటు ఇతర ప్రత్యామ్నాయాలను పరిశీలించడం కూడా కొనసాగిస్తామని ఐసీసీ పేర్కొంది. కోవిడ్‌–19 కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఎదుర్కొంటున్న పరిస్థితిని  సమీక్షిస్తూనే ఆటగాళ్ల ఆరోగ్య భద్రత తదితర అంశాలపై కూడా దృష్టి పెట్టినట్లు చెప్పింది.

‘ప్రస్తుతం ఉన్న స్థితిలో క్రికెట్‌కు సంబంధించి సరైన నిర్ణయం తీసుకోవడం ఎంతో అవసరం. ఈ విషయంలో క్రికెటర్లతో పాటు ఇందులో భాగస్వాములుగా ఉండే అనేక మందిని పరిగణలోకి తీసుకోవాలి. ఇంత కీలక అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఒకేసారి ఉంటుంది. కాబట్టి సభ్యులు, ప్రసారకర్తలు, ప్రభుత్వాలు, ఆటగాళ్లు అందరితో చర్చించిన తర్వాతే దానిని ప్రకటిస్తాం’ అని ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మనూ సాహ్ని స్పష్టం చేశారు. మరోవైపు ఐసీసీ ఈవెంట్ల నిర్వహణ కోసం పన్నుల మినహాయింపునకు సంబంధించిన తమ సమస్యను పరిష్కరించుకునేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి డిసెంబర్‌ 2020 వరకు గడువు పొడిగించినట్లు కూడా ఐసీసీ వెల్లడించింది.

మహిళల ముక్కోణపు టోర్నీకి ఈసీబీ ప్రయత్నాలు
సెప్టెంబర్‌లో అంతర్జాతీయ మహిళా క్రికెట్‌ను పునరుద్ధరించేందుకు ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డ్‌ (ఈసీబీ) ప్రయత్నిస్తోంది. మహిళల ముక్కోణపు సిరీస్‌కు ఆతిథ్యమిచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోన్న ఈసీబీ... ఈ మేరకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి, క్రికెట్‌ దక్షిణాఫ్రికాలతో సమాలోచనలు చేస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మహిళల అంతర్జాతీయ పోటీలు ఈ ఏడాదిలోనే ప్రారంభమవుతాయని ఈసీబీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ టామ్‌ హారిసన్‌ అన్నారు.

మరిన్ని వార్తలు