కేఎల్‌ రాహుల్‌ 2.. విరాట్‌ కోహ్లి 10

17 Feb, 2020 15:44 IST|Sakshi

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) విడుదల చేసిన తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ తన రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో విశేషంగా రాణించిన రాహుల్‌ 823 రేటింగ్‌ పాయింట్లతో తన స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నాడు.  న్యూజిలాండ్‌ను 5-0తో క్లీన్‌స్వీప్‌ చేయడంలో కీలక పాత్ర పోషించిన రాహుల్‌ 56 యావరేజ్‌తో 224 పరుగులు చేశాడు. ఇక టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 9వ స్థానం నుంచి పదో స్థానానికి పడిపోయాడు.

ఆ సిరీస్‌లో 105 పరుగులకే పరిమితమైన కోహ్లి.. 10వ స్థానానికి పరిమితమయ్యాడు. టీ20 బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో వీరిద్దరే టాప్‌-10లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు. ఇక్కడ పాకిస్తాన్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజామ్‌ 879 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ 9వ స్థానానికి చేరుకున్నాడు. ఆసీస్‌ కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ మూడో స్థానంలో నిలిచాడు. ఇక బౌలింగ్‌, ఆల్‌ రౌండర్‌ విభాగాల్లో ఆఫ్గానిస్తాన్‌ ఆటగాళ్లు రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ నబీలు వరుసగా టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. జట్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా నాల్గో స్థానంలో ఉండగా, ఇంగ్లండ్‌ మూడో స్థానంలో ఉంది. ఈ జాబితాలో పాకిస్తాన్‌ తొలి స్థానంలో ఉండగా, ఆసీస్‌ రెండో స్థానంలో ఉంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా