‘భారత్‌-పాక్‌ మ్యాచ్‌ లేకుంటే టెస్టు చాంపియన్‌ షిప్‌ దండుగ’

15 Oct, 2017 17:06 IST|Sakshi

పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ వకార్‌ యునీస్‌

భారత్‌తో ఆడడానికి ఎక్కడైన సిద్దమే

లాహోర్‌: భారత్‌-పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌లు లేకుండా టెస్టు చాంపియన్‌ షిప్‌ నిర్వహించడం శుద్ద దండుగ అని పాక్‌ మాజీ కెప్టెన్‌, కోచ్‌ వకార్‌ యునీస్‌ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఐసీసీ 9 దేశాలతో టెస్టు చాంపియన్‌ షిప్‌, 13 దేశాల వన్డే లీగ్‌ నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై వకార్‌ ఓ చానెల్‌ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘ టెస్టు చాంపియన్‌ షిప్‌ మంచి ఆలోచనే. కానీ పాక్‌, భారత్‌తో క్రికెట్‌ ఆడటం లేదు. దీంతో టెస్టు చాంపియన్‌ షిప్‌కు ఇబ్బంది ఏర్పడవచ్చు. ఒకవేళ ఈ టెస్టు చాంపియన్‌ షిప్‌లో భారత్‌-పాక్‌ల మధ్య మ్యాచ్‌లు జరిగితే.. ఇరుదేశాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడుతాయి. ఈ రెండు దేశాలు ఒక్కసారికూడా తలపడకుండా టాప్‌-1,2 ర్యాంకు సాధిస్తే ఇది చాంపియన్‌ షిప్‌ అని ఎలా పిలుస్తామని’ వకార్‌ వ్యాఖ్యానించారు.

పాక్‌లో ఆడటానికి భారత్‌కు ఇబ్బందిగా ఉంటే దుబాయ్‌ వేదికగా ఆడండి. దుబాయ్‌ పాక్‌ హోం గ్రౌండ్‌ లాంటిదేనని వకార్‌ భారత్‌కు సూచించారు. అక్కడ కాకుంటే ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, ఎక్కడైనా భారత్‌తో ఆడటానికి పాక్‌కు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. రెండేళ్లపాటు జరిగే టెస్టు చాంపియన్‌ షిప్‌లో 9 దేశాలు పాల్గొంటాయని, ఒక్కో దేశం ఆరు సిరీస్‌లు ఆడుతుందని ఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే 3 సిరీస్‌లు స్వదేశంలో మిగిలిన 3 సిరీస్‌లు విదేశాల్లో ఆడాలని తెలిపింది. అయితే భారత్‌-పాక్‌ మధ్య సిరీస్‌లు ఎలా కొనసాగుతాయనే విషయంలో ఐసీసీ స్పష్టతను ఇవ్వలేకపోయింది.  

మరిన్ని వార్తలు