110 దగ్గర మొదలెట్టాడు.. 8కి చేరాడు

4 Dec, 2019 17:15 IST|Sakshi

మార్నస్‌ లబుషేన్‌ క్రికెట్‌ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లబుషేన్‌ గురించి రెండు మాటల్లో చెప్పాలంటే స్టీవ్‌ స్మిత్‌ వంటి బ్యాటింగ్‌ స్టైల్‌.. విరాట్‌ కోహ్లిలా పరుగుల ప్రవాహం. గతేడాది అక్టోబర్‌లో పాకిస్తాన్‌పై టెస్టు అరంగేట్రం చేశాడు... ఈ ఏడాది చివర్లో అదే పాక్‌ సిరీస్‌ ముగిసే సరికి టాప్‌-10లో ఉన్నాడు. ఏడాది ముగిసే సరికే ఈ ఆసీస్‌ క్రికెటర్‌ ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. ఇప్పటివరకు ఆడింది కేవలం 11 టెస్టులే. కానీ 53.53 సగటుతో 910 పరుగుల సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 5 అర్ధసెంచరీలు ఉండటం విశేషం. ముఖ్యంగా తాజాగా పాక్‌తో ముగిసిన సిరీస్‌లో డేవిడ్‌ వార్నర్‌తో పోటీ పడి మరీ పరుగుల సాధించాడు. దీంతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 8వ స్థానానికి ఎగబాకాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌ల్లో 110వ స్థానంతో ఈ ఏడాది ఆటను ఆరంభించిన లబుషేన్‌.. ఏడాది ముగిసే సరికి టాప్‌ టెన్‌లో నిలిచాడు. ఈ విషయాన్ని ఐసీసీ ముఖ్యంగా ప్రస్తావిస్తూ ప్రత్యేక ట్వీట్‌ చేసింది.  

బాల్‌ ట్యాంపరింగ్‌ చేయడంతో డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌స్మిత్‌పై క్రికెట్‌ ఆస్ట్రేలియా ఏడాది నిషేధం విధించింది. అప్పుడు జట్టులోకి అడుగుపెట్టాడు లబుషేన్‌. స్వతహాగా లెగ్‌ స్పిన్నరైన అతడు బ్యాటింగ్‌లోనూ సమర్థుడు. ఐతే 8 ఇన్నింగ్సుల్లో 26.25 సగటుతో 210 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. నిషేధం తర్వాత యాషెస్‌ సిరీస్‌లో స్మిత్‌ పునరాగమనంతో లబుషేన్‌ తుదిజట్టులో చోటు కోల్పోయాడు. అయితే లార్డ్స్‌ టెస్టులో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన లబుషేన్‌ సత్తా చాటాడు. దీంతో అతడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.  ఆ సిరీస్‌లో మూడు అర్దశతకాలు సాధించిన లబుషేన్‌ అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా పాక్‌తో ముగిసిన సిరీస్‌లో బ్రిస్బేన్‌ టెస్టులో 185, అడిలైడ్‌లో 162 పరుగులు చేసి ఆసీస్‌ జట్టులో కీలక బ్యాట్స్‌మన్‌గా అవతరించాడు. 

లబుషేన్‌ ట్యాలెంట్‌ను పసిగట్టిన క్రికెట్‌ ఆస్ట్రేలియా కీలకమైన మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపుతోంది. ఇక ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న లబుషేన్‌ తన అసాధారణ ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఇక ఇప్పటికే 910 పరుగులు సాధించిన లబుషేన్‌ 2019 క్యాలెండర్‌ ఇయర్‌ 1000 పరుగుల మైలురాయిని అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే డిసెంబర్‌ 12 నుంచి న్యూజిలాండ్‌తో ఆసీస్‌ మూడు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. దీంతో ఈ సిరీస్‌లో రాణించి తిరిగి నంబర్‌ వన్‌ స్థానాన్ని నిలబెట్టుకోవాలని స్టీవ్‌ స్మిత్‌ ఆరాటపడుతుండగా.. ఈ ఇయర్‌ క్యాలెండర్‌లో అత్యధిక పరుగుల సాధించాలని లబుషేన్‌ తెగ ఉత్సాహంగా ఉన్నాడు.  
 

మరిన్ని వార్తలు