వీళ్లపై ఓ లుక్కేద్దాం...

13 Mar, 2014 00:53 IST|Sakshi
వీళ్లపై ఓ లుక్కేద్దాం...

 దూసుకొస్తున్న మెరుపు ఆటగాళ్లు
 సూపర్ ఇన్నింగ్స్‌తో ఇప్పటికే గుర్తింపు
 వరల్డ్‌కప్‌లో ముద్ర వేసేందుకు సిద్ధం
 
 టి20 క్రికెట్‌లో స్టార్ బ్యాట్స్‌మెన్, మెరుపు వీరులు అనగానే కొన్ని పేర్లు వినిపిస్తాయి. క్రిస్ గేల్, కోహ్లి, డివిలియర్స్, వార్నర్, వాట్సన్, ధోని, ఆఫ్రిది, మెకల్లమ్...ఈ జాబితా ఇలా సాగుతుంది. సందేహం లేదు...  వీళ్లంతా స్టార్లే. ఒంటి చేత్తో తమ జట్లకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. ఈ క్రికెటర్ల జోరును మనం ఎంతో ఆస్వాదించాం. ఈ సారి టి20 ప్రపంచ కప్‌లో కూడా వీరు కీలకమే.
 
 అయితే వీళ్లతోపాటు ప్రపంచకప్‌లో మనకు పరుగుల వినోదాన్ని అందించేందుకు మరి కొంత మంది కొత్త ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల వీరు తమ సంచలన ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. దాంతో వీరిపై ఆయా జట్లు ఎన్నో అంచనాలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా గత వరల్డ్ కప్ సమయంలో పెద్దగా గుర్తింపులో లేకపోయినా...ఈ ప్రపంచ కప్ సమయానికి వీళ్లంతా బాగా ఎదిగారు. ఈ టి20 ప్రపంచకప్‌లో గమనించదగ్గ కొత్త ఆటగాళ్లపై ఫోకస్...
 
 ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా)
 గత ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లో 63 బంతుల్లోనే 11 ఫోర్లు, 14 సిక్సర్లతో 156 పరుగులు చేసి (47 బంతుల్లోనే సెంచరీ) ఫించ్ ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. ఆ వెంటనే భారత్‌తో కూడా 52 బంతుల్లో 89 పరుగులు చేసి తన జోరు గాలివాటం కాదని నిరూపించాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్‌లో రెండు మెరుపు సెంచరీలు చేసి ఫించ్ తన ఫామ్ చాటాడు. అంతర్జాతీయ టి20ల్లో అతని స్ట్రైక్ రేట్ 170.89 కావడం విశేషం.
 
 కోరీ అండర్సన్ (న్యూజిలాండ్)
 వన్డేల్లో 36 బంతుల్లోనే సెంచరీ చేసి అండర్సన్ అనూహ్యంగా తెరపైకి వచ్చాడు.
 తొలి సెంచరీ తర్వాత భారత్‌పై 40 బంతుల్లోనే 68... 17 బంతుల్లోనే 44 పరుగులు చేసిన ఇన్నింగ్స్‌లు అతని విలువేంటో చూపించాయి. అంతర్జాతీయ టి20ల్లో ఇంకా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడకపోయినా... ధాటిగా ఆడే అతని శైలి ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోతుంది. కివీస్ దేశవాళీలో అండర్సన్ భారీ సిక్సర్లకు పెట్టింది పేరు.
 
 డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా)
 గత ఐపీఎల్‌లో పంజాబ్ తరఫున ఆడుతూ బెంగళూరుపై 38 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 101 పరుగులు చేసి ‘కిల్లర్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. పవర్‌ప్లేలో బిగ్ ప్లేయర్‌గా మిల్లర్‌కు దక్షిణాఫ్రికా క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఏడాది అక్కడి దేశవాళీ టి20 టోర్నీ ర్యామ్‌స్లామ్ చాలెంజ్‌లో 153.20 స్ట్రైక్ రేట్‌తో టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచి తన ఫామ్‌ను చాటుకున్నాడు. ఇటీవల సెంచూరియన్ వన్డేలో 34 బంతుల్లో 56 పరుగులు చేసిన మిల్లర్ జోరు ఏమిటో ఇటీవల భారత్ కూడా రుచి చూసింది.
 
 శిఖర్ ధావన్ (భారత్)
 గత టి20 ప్రపంచ కప్‌లో భారత జట్టులో లేని ధావన్... ఈ రెండేళ్ల కాలంలో జట్టు ప్రధాన బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. ఫార్మాట్ ఏదైనా తనదైన ధాటిని ప్రదర్శించగల అతను టోర్నీలో టీమిండియాకు కీలకం కానున్నాడు. గత ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరఫున 122.92 స్ట్రైక్‌రేట్‌తో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వన్డేల్లో చేసిన ఐదు మెరుపు సెంచరీలు ధావన్ పవర్ ప్లే ఏమిటో చూపించాయి. టి20ల్లో ఇదే తరహా మెరుపు ఆరంభాన్ని ఆశించవచ్చు.
 

మరిన్ని వార్తలు