అండర్‌–19 ప్రపంచకప్‌ షురూ

17 Jan, 2020 01:35 IST|Sakshi
అండర్‌–19 ప్రపంచ కప్‌ ట్రోఫీతో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత జట్టు కెప్టెన్‌ ప్రియమ్‌ గార్గ్, ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికా కెప్టెన్‌ బ్రైస్‌ పార్సన్స్‌.

డిఫెండింగ్‌ చాంపియన్‌గా భారత్‌

కేప్‌టౌన్‌: క్రికెట్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు కుర్రాళ్లకు అవకాశం దక్కింది. నేటి నుంచి అండర్‌–19 ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో సత్తా చాటేందుకు వారు సిద్ధమయ్యారు. మొత్తం 16 జట్లు తలపడే ఈ టోర్నీలో యువ భారత్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఎలాగో కుర్రాళ్ల సంగ్రామంలో భారత్‌ అలాంటి జట్టు. ఎవరికీ సాధ్యం కానీ రీతిలో యువ జట్టు నాలుగు సార్లు (2000, 2008, 2012, 2018) విజేతగా నిలిచింది.

ఇప్పుడు గ్రూప్‌–డిలో న్యూజిలాండ్, శ్రీలంక, జపాన్‌లతో మరో టైటిల్‌ వేటకు సిద్ధమైంది.  నేడు ఆతిథ్య దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్‌ జట్ల మధ్య గ్రూప్‌ ‘ఎ’లో తొలి పోరు జరగనుండగా... 19న యువ భారత్‌ తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడుతుంది. వచ్చే నెల 9న జరిగే తుదిపోరుతో ఈ మెగా ఈవెంట్‌ ముగుస్తుంది. మొత్తం 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు.

ఒక దశలో ఒక్కో గ్రూపు నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన రెండు జట్లు సూపర్‌ లీగ్‌లో తలపడతాయి. ఇంకో దశలో తర్వాత మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ప్లేట్‌ లీగ్‌ పోటీలు జరుగుతాయి. అయితే సూపర్‌ లీగ్‌ జట్లు మాత్రమే టైటిల్‌ వేటలో ఉండగా... మిగతా జట్లు వర్గీకరణ పోటీల్లో తలపడతాయి.

భారత అండర్‌–19 జట్టు: ప్రియమ్‌ గార్గ్‌ (కెప్టెన్‌), ఠాకూర్‌ తిలక్‌ వర్మ, అథర్వ అంకోలెకర్, యశస్వి జైస్వాల్, కార్తీక్‌ త్యాగి, సుశాంత్‌ మిశ్రా, రవి బిష్ణోయ్, దివ్యాన్‌‡్ష సక్సేనా, సిద్ధేశ్‌ వీర్, ఆకాశ్‌ సింగ్, శుభాంగ్‌ హెగ్డే, ధ్రువ్‌ జురెల్, కుశాగ్ర కుమార్, విద్యాధర్‌ పాటిల్, శాశ్వత్‌ రావత్, దివ్యాన్‌‡్ష జోషి.

యువ భారత్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌  (వేదిక బ్లూమ్‌ఫొంటెన్‌ )
జనవరి 19 భారత్‌–శ్రీలంక 
జనవరి 21 భారత్‌–జపాన్‌ 
జనవరి 24 భారత్‌–న్యూజిలాండ్.

మరిన్ని వార్తలు