కుర్రాళ్ల సమరం

4 Feb, 2020 00:40 IST|Sakshi
ప్రాక్టీస్‌ సెషన్‌లో పాకిస్తాన్, భారత జట్ల ఆటగాళ్లు

అండర్‌–19 ప్రపంచ కప్‌ సెమీఫైనల్లో నేడు భారత్, పాకిస్తాన్‌ మధ్య పోరు

అమితోత్సాహంతో ఇరు జట్లు

లీగ్‌ దశలో ఓటమి లేకుండా సెమీస్‌కు

మధ్యాహ్నం  గం. 1.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–3లో ప్రత్యక్ష ప్రసారం  

వాళ్లంతా టీనేజ్‌ దాటని కుర్రాళ్లే. కానీ ప్రత్యర్థితో సీరియస్‌గా వ్యవహరించడంలో సీనియర్లకంటే మిన్నగానే కనిపిస్తున్నారు. సరదా పలకరింపులు లేవు, హ్యాండ్‌షేక్‌లు అసలే కనిపించడం లేదు, అలా పక్క నుంచి ‘ఆ’ జట్టు ఆటగాడు వెళుతున్నాడంటే తమ సంభాషణ కూడా ఆపేస్తున్నారు. భోజనం క్యూలో అవతలి జట్టు ఆటగాడి వెనుక మరొకరు నిల్చోవాల్సి వచ్చినప్పుడు అక్కడ కూడా కాస్త మొహంపై చిరునవ్వు చూపించడం కష్టంగా మారిపోయింది. ఇరు జట్ల క్రికెటర్లంతా వీర గంభీరంగా కనిపిస్తున్నారు. 

సరిగ్గా చెప్పాలంటే సరిహద్దుకు ఆవల, ఇవతల అన్నట్లుగా యువ ఆటగాళ్లు వ్యవహరించడం ఇరు జట్ల ప్రాక్టీస్‌లో స్పష్టంగా కనిపించింది. భారత్, పాకిస్తాన్‌ జట్ల మధ్య క్రికెట్‌ సమరం అంటే దశాబ్దాలుగా ఎంతటి ఆసక్తి, మ్యాచ్‌కు ముందు ఎలాంటి వాతావరణం ఉంటుందో అందరికీ తెలుసు. వేదిక, స్థాయి ఏదైనా అది ఎక్కడా తగ్గలేదు. ఇప్పుడు మరోసారి దాయాదుల మధ్య సమరానికి రంగం సిద్ధమైంది. యువ ప్రపంచకప్‌ సెమీస్‌లో తలపడుతున్న వీరిలో ముందంజ వేసేది ఎవరనేది ఆసక్తికరం.

పాచెఫ్‌స్ట్రూమ్‌ (దక్షిణాఫ్రికా): చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్‌ మధ్య మరి కొన్ని గంటల్లో మెగా క్రికెట్‌ సమరం జరగనుంది. ఈసారి ఈ పోరులో కుర్రాళ్లు తలపడుతున్నారు. అండర్‌–19 ప్రపంచ కప్‌లో భాగంగా నేడు జరిగే తొలి సెమీఫైనల్లో ఇరు జట్లు హోరాహోరీ పోరుకు ‘సై’ అంటున్నాయి. భారత్‌ గతంలో నాలుగు సార్లు ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంటే... పాక్‌ రెండు సార్లు విజేతగా నిలిచింది. తాజా టోర్నీలో ప్రదర్శనను బట్టి చూస్తే మాత్రం ఇరు జట్లు సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి కాబట్టి విజేతను అంచనా వేయడం అంత సులువు కాదు. టోర్నీలో భారత్‌ అత్యధిక స్కోరు 297 కాగా పాక్‌ 294 పరుగులు చేసింది. బౌలింగ్‌లో భారత్‌ మొత్తం 40 వికెట్లు పడగొట్టగా, పాక్‌ 39 వికెట్లు తీసింది.

ప్రియమ్‌ గార్గ్‌

యశస్వి మినహా... 
డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగితున్న భారత జట్టు ఇప్పటి వరకు కనిపించని బ్యాటింగ్‌ లోపాన్ని సరిదిద్దుకోవాల్సి ఉంది. లీగ్‌ దశలో మన టీమ్‌ 3 మ్యాచ్‌లూ గెలిచి అజేయంగా నిలిచింది. ఇందులో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ఒక్కడే 3 అర్ధసెంచరీలు సహా 207 పరుగులతో మెరిశాడు. అతనికి, రెండో స్థానంలో ఉన్న దివ్యాంశ్‌ సక్సేనా (89 పరుగులు) మధ్య ఉన్న తేడా చూస్తేనే పరిస్థితి అర్థమవుతోంది. తక్కువ స్కోర్లు ఛేదించాల్సి రావడం వాస్తవమే అయినా ఒక వన్డే మ్యాచ్‌లో భారత్‌ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ ప్రదర్శన మాత్రం రాలేదు.

ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో అది కనిపించింది. ఇతర ప్రధాన బ్యాట్స్‌మెన్‌ సిద్ధేశ్‌ వీర్, జురేన్, కెప్టెన్‌ ప్రియమ్‌ గార్గ్‌ కూడా చెలరేగితే ప్రత్యర్థికి కష్టాలు తప్పవు. హైదరాబాదీ ఠాకూర్‌ తిలక్‌ వర్మ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడితే అతనికి ఈ మ్యాచ్‌ చిరకాలం గుర్తుండిపోతుంది. మన బౌలింగ్‌ మాత్రం చక్కగా రాణిస్తుండటం చెప్పుకోదగ్గ అంశం. లెగ్‌స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ 11 వికెట్లు పడగొట్టగా, పేసర్‌ కార్తీక్‌ త్యాగి 9 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆకాశ్‌ సింగ్, అథర్వ అంకోలేకర్‌ కూడా ఇప్పటికే తమ సత్తా చాటారు.

పాక్‌ కూడా...

రొహైల్‌ నజీర్

పాకిస్తాన్‌ పరిస్థితి కూడా భిన్నంగా ఏమీ లేదు. ఆ జట్టు కూడా బ్యాటింగ్‌కంటే బౌలింగ్‌పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. టీమ్‌ తరఫున మొహమ్మద్‌ హారిస్‌ ఒక్కడే మొత్తం స్కోరు వంద పరుగులు దాటగా (110) ఒక మ్యాచ్‌ రద్దు కారణంగా ఎక్కువ మంది బ్యాట్స్‌మెన్‌కు పెద్దగా ఆడే అవకాశం రాలేదు. ఖాసిమ్‌ అక్రమ్, హైదర్‌ అలీ, కెప్టెన్‌ రొహైల్‌ నజీర్, ఇర్ఫాన్‌ ఖాన్, ఫహద్‌ మునీర్‌ ఇతర ప్రధాన బ్యాట్స్‌మెన్‌. గత మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన మొహమ్మద్‌ హురైరా తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లో మాత్రం అబ్బాస్‌ అఫ్రిది (9 వికెట్లు), ఆమిర్‌ ఖాన్, తాహిర్‌ హుస్సేన్‌ (చెరో 7 వికెట్లు) ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శిస్తూ చెలరేగారు. ఈ ముగ్గురు పేస్‌ బౌలర్లు ఇప్పుడు భారత టాపార్డర్‌ను దెబ్బ తీయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. అయితే నాణ్యమైన స్పిన్నర్‌ లేకపోవడం పాక్‌ జట్టులో ప్రధానంగా కనిపిస్తున్న లోటు.

మరిన్ని వార్తలు