టచ్‌లోకి వస్తారు.. వల వేస్తారు..!

19 Apr, 2020 12:08 IST|Sakshi

లాక్‌డౌన్‌లోనే ‘ఫిక్స్‌’ చేస్తారు జాగ్రత్త

క్రికెటర్లకు ఐసీసీ వార్నింగ్‌

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌ అన్నీ రద్దయ్యాయి. దాంతో క్రీడాకారులంతా ఇంట్లోనే ఉంటూ సోషల్‌ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారు. అయితే ఇలా సోషల్‌ మీడియాలో కాలక్షేపం చేసే క్రమంలో ఫిక్సర్లతో జాగ్రత్తగా ఉండాలని అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) హెచ్చరిస్తోంది. ప్రస్తుతం క్రికెట్‌ ఈవెంట్లు ఏమీ లేవని ఏ విషయాన్ని లైట్‌గా తీసుకోవద్దని ముందుగా క్రికెటర్లను హెచ్చరించింది.

ఫిక్సర్లకు ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌ ఈవెంట్లు, వాటి ఫలితాలే కాదని, లాంగ్‌ షెడ్యూల్‌ మ్యాచ్‌లపై కూడా ఫిక్సింగ్‌ చేయడానికి ఈ లాక్‌డౌన్‌ వినియోగించే అవకాశాలు లేకపోలేదంటూ విన్నవించింది.  ఈ మేరకు ఐసీసీ యాంటీ కరప్షన్‌ యూనిట్‌ చీఫ్‌ అలెక్స్‌ మార్షల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ కరోనా వైరస్‌తో క్రీడా ఈవెంట్లు తాత్కాలికంగా ఆగిపోయాయి. అటు అంతర్జాతీయ మ్యాచ్‌లు, ఇటు దేశవాళీ మ్యాచ్‌లు అనే తేడా లేకుండా అంతా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. ఈ సమయాన్ని ఫిక్సర్లు క్యాష్‌ చేసుకునే అవకాశం ఉంది. (‘అతని బౌలింగ్‌ అంటే ఎంతో ఇష్టం’)

ఇటువంటి సందర్భాల్లో వారు చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఫిక్సింగ్‌లో బాగా పేరుగాంచిన కొంతమంది ప్రస్తుత సమయాన్ని వినియోగించుకుంటారు. మన క్రికెటర్లు ఎవరైతే సోషల్‌ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటారో వారితో టచ్‌లోకి వస్తారు.. మాటా-మంతీ కలిపి వల వేస్తారు. మీతో పరిచయాల్ని పెంచుకోవడానికి యత్నిస్తారు. ఆపై ఫిక్సింగ్‌కు చేయడానికి ప్రేరేపిస్తారు. ఈ విషయాన్ని అన్ని క్రికెట్‌ బోర్డులకు విషయాన్ని చెరవేసి అప్రమత్తంగా కావాలని కోరాం’ అని అలెక్స్‌ మార్షల్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు