అగ్రస్థానంలోనే మంధాన, జులన్‌

22 Mar, 2019 21:09 IST|Sakshi

దుబాయ్‌: భారత అగ్రశ్రేణి మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, జులన్‌ గోస్వామి తమ టాప్‌ స్థానాలను నిలుపుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) శుక్రవారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో స్మృతి 797 పాయింట్లతో బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉండగా... బౌలర్ల కేటగిరీలో జులన్‌ గోస్వామి 730 పాయింట్లతో నెం.1గా కొనసాగుతోంది. భారత వన్డే కెప్టెన్‌ మిథాలీరాజ్‌ 713 పాయింట్లతో నాలుగోస్థానంలో నిలిచింది. టాప్‌–10 బ్యాట్స్‌వుమెన్‌లో భారత్‌ నుంచి మిథాలీ, స్మృతి మినహా వేరెవరూ చోటు దక్కించుకోలేకపోయారు.

బౌలింగ్‌ విభాగంలో పేసర్‌ శిఖా (688 పాయింట్లు), లెగ్‌స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ (656 పాయింట్లు) వరుసగా ఐదు, పదో స్థానాలను దక్కించుకున్నారు.   వన్డే టీమ్‌ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా (22 పాయింట్లు) అగ్రస్థానం, ఇంగ్లండ్‌ 18 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. భారత్‌ (16 పాయింట్లు), న్యూజిలాండ్‌ (14), దక్షిణాప్రికా (13) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. దీంతో న్యూజిలాండ్‌ వేదికగా 2021లో జరుగనున్న ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌నకు టాప్‌–5లో నిలిచిన ఈ ఐదు దేశాలు అర్హత సాధించాయి. శ్రీలంక క్వాలిఫయింగ్‌ టోర్నీల ద్వారా ఈ మెగా టోర్నీకి అర్హత సాధించాల్సి ఉంది.   
 

మరిన్ని వార్తలు