రెండు అవకాశాలు.. నో యూజ్‌

27 Feb, 2020 10:49 IST|Sakshi

మెల్‌బోర్న్‌: శ్రీలంకతో జరిగిన వన్డేలో నాలుగు పరుగుల వద్ద వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏకంగా 264 పరుగులు సాధించాడు టీమిండియా హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ. ప్రత్యర్థిజట్టు ఆటగాళ్ల తప్పిదాలతో బ్యాటర్లకు అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి. కానీ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే భారీ స్కోర్లు నమోదు చేసి చరిత్ర లిఖించవచ్చు. అయితే సంచలన బ్యాట్స్‌వుమెన్‌ షఫాలీ వర్మ తనకు రెండు అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ టీనేజర్‌కు 25,32 పరుగుల వద్ద రెండు జీవనాధారాలు లభించాయి. కానీ భారీ స్కోర్‌ చేయడంలో విఫలమై 46 పరుగులకే వెనుదిరిగింది. 

హయ్‌లీ జెన్‌సెన్‌ బౌలింగ్‌లో షఫాలీ 25 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను మాడీ గ్రీన్‌ జారవిడవగా, 32 పరుగుల వద్ద రోజ్‌మెరీ మెయిర్‌ బౌలింగ్‌లో మరో లైఫ్‌ లభించింది. అయితే వరుసగా వికెట్లు పడుతుండటం, రెండు అవకాశాలు లభించడంతో షఫాలీపై అందరూ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే అప్పటికీ పలు నిర్లక్ష్యపు షాట్‌లు ఆడిన షఫాలీ అమెలియా కెర్‌ బౌలింగ్‌లో అనవసరపు భారీ షాట్‌ ఆడి క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగి ఫ్యాన్స్‌ను ఘోరంగా నిరుత్సాహపరిచారు. కీలక సమయంలో జట్టును ఆదుకునే అవకాశం లభించినా షఫాలీ నిర్లక్ష్యంగా ఆడటంపై విమర్శకులు మండిపడుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన(11), రోడ్రిగ్స్‌(10), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(1), వేద కృష్ణమూర్తి(6)లు కివీస్‌ బౌలింగ్‌ దాటికి పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో టీమిండియా భారీ స్కోర్‌ సాధిస్తుందనుకోగా వరుస వికెట్లతో ఓ మోస్తారు స్కోర్‌కే పరిమితమైంది.  

చదవండి:
‘డ్యాన్స్‌ బాగుంది.. ట్రోఫీ తెస్తే ఇంకా బాగుంటుంది’
‘ఆమెకు మేనేజ్‌మెంట్‌ లైసెన్స్‌ ఇచ్చింది’ 

మరిన్ని వార్తలు